Saturday, November 16, 2024

సెప్టెంబర్ 4న వల్మిడీకి సిఎం కేసీఆర్ రాక…

- Advertisement -
- Advertisement -
  • శ్రీ సీతారామచంద్రస్వాముల విగ్రహాల పునఃప్రతిష్టాపనలో పాల్గొనున్న సిఎం
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ ప్రతినిధి : ఎంతో ప్రసిద్ధిగల వల్మిడీ శ్రీసీతారామచంద్రస్వాముల వారి విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 4న వల్మిడీకి రానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

మంగళవారం వల్మిడీ దేవాలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏర్పాట్లను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరగనుందని, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా వల్మిడీ శ్రీసీతారామచంద్రస్వామి స్వాముల వారి విగ్రహాలను పునఃప్రతిష్టిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్ హాజరవుతారని తెలిపారు.

సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు 4 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలపై ప్రత్యేకంగా రూపొందించిన 6 ప్రచార రథాలతో ఆడియో, వీడియోలతో విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ ఆహ్వానం పలకనున్నారు. దేవాలయ ప్రాంగణంలో ఓ బ్యాగ్, పసుపు కుంకుమ, గాజులు, పులిహోర, లడ్డూ ప్రసాదాల పంపిణీ చేయనున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి మన వల్మిడీకి చెందిన వాడని చరిత్ర చెబుతుందని, ఆయన పేరునే వాల్మీకిపురంగా పేరు వచ్చిందన్నారు. కాలక్రమంలో ఆ పేరు కాస్త వల్మిడీగా మారిందన్నారు.

నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు 30వేల మందికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, అందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రచార వాహనాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు వివరాలను అందజేయాలని కోరారు. అదేవిధంగా ఉత్సవాలు జరిగే నాలుగు రోజులపాటు తొర్రూరు, హన్మకొండ, వరంగల్, జనగామ డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ ప్రాంగణంలో జరిగే నాలుగు రోజుల ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం రెండు లేదా మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు.

సినీ నేపథ్య గాయనీ గాయకులు, నృత్య కళాకారులు, పేరిని కళాకారులు శివతాండవం, భరతనాట్యం, జానపద నృత్యాలు, గేయాలు, కోలాట కళాకారులను ప్రత్యేకంగా పిలిపించి సాంస్కృతిక విభావరి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ సీతారాం, ఎర్రబెల్లి ట్రస్టు చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు, ఏసీపీ సురేష్‌కుమార్, విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీస్, పంచాయతీరాజ్, దేవాదాయ, డీఆర్డీవోతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News