మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి దాదాపు 150 మందికి పైగా ఎన్నారై బిఆర్‌ఎస్, ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. సిఎం కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్లు ఆశీర్వదించాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్, ఎన్నారై బిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం టెలిఫోన్ కాల్ ద్వారా అందరితో మాట్లాడారు.
కెసిఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని, సందర్భం ఏదైనా వారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజాన్ని అనిల్ కూర్మాచలం కోరారు. కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని అనిల్ కూర్మాచలం ప్రార్థించారు. ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడే మన పాలకుడై రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కెసిఆర్ దేశానికి నాయకత్వం వహించాలని దేశం ఎదురుచూస్తుందని ఆయన తెలిపారు. అబుజాఫర్, చంద్రశేఖర్, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శి హరిగౌడ్ నవాబ్‌పేట్, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధి రవిప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి ఎన్నారై నాయకులు మల్లారెడ్డి, వీర ప్రవీణ్‌కుమార్, గణేష్ పస్తం, సతీష్ రెడ్డి బండా, గణేష్ కుప్పలా, ప్రశాంత్ మామిడాల, సురేష్ బుడగం, ప్రవాస సంఘాల నాయకులు శుష్మునా రెడ్డి, స్వాతి బుడగం, ప్రవళిక భువనగిరి, స్నేహ, నంతిని పాల్గొన్నారు.