పర్యాటక దినోత్సవం విజయవంతంలో తమ సిబ్బంది సహకారం ఎంతో ఉంది
‘ఉద్యోగుల అభినందన’ కార్యాక్రమంలో టిఎస్ టిడిసి ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన “ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ” తమ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది కృషితో విజయవంతం అయ్యాయని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వచ్చేలా నిరంతరం ఇన్నోవేటివ్‌గా ఉండాలని ఆయన తమ శాఖ సిబ్బందికి పిలుపు నిచ్చారు. ప్రపంచ టూరిజం డే విజయవంతం అయిన సందర్భంగా తమ శాఖ సిబ్బంది అభినందన కార్యక్రమం హిమాయత్‌నగర్‌లోని పర్యాటకాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ టూరిజం గ్రామాల ఎంపిక చేశారన్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 795 అప్లికేషన్లు రాగా వాటిని స్కూృటినీ చేసి 35 గ్రామాలకు అవార్డులను ప్రకటించారని, ఇందులో తెలంగాణలోని పెంబర్తి, చంద్లాపూర్‌లకు అవార్డులు రావడం ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు. తమ టిఎస్ టిడిసి లో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వస్తున్న విజ్ఞప్తులను సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా వారిని పర్మినెంట్ చేయిస్తామని ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
దేశంలో అవార్డులు మనకు ఊరికే రావని, తారామతి బారాదారిలో శిక్షణనిచ్చి పర్యాటక శాఖకు అవార్డులు వచ్చేలా చేశామన్నారు. దేశంలోని గ్రామీణ టూరిజంకు అవార్డులు ఎలా ఇస్తారు? ఏం చేస్తే ఆ అవార్డులు మనను వరిస్తాయని మదనపడిన తాము ఆ మేరకు గ్రామీణ టూరిజం పట్ల కూడా తమ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు విజయవంతం అయ్యేలా కృషి చేసిన తమ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా పర్యాటకాభివృద్ధిశాఖ పిఆర్‌ఓ శ్రీనివాస్‌తో పాటు సుమారు 25 మందిని శాలువా కప్పి ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌టిడిసి డైరెక్టర్ మనోహర్‌తో పాటు ఆ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.