Friday, September 20, 2024

కెసిఆర్ త్వరలోనే కోలుకుంటారు

- Advertisement -
- Advertisement -

CM KCR health tests in Yashoda Hospital

 

పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు
ఎలాంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదు, ఆక్సిజన్
లెవల్స్ సాధారణమేనన్న యశోద డాక్టర్లు
వైద్య పరీక్షల తర్వాత తిరిగి ఎర్రవల్లికి చేరిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన సిఎం కెసిఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో సిటి స్కాన్, ఇతర పరీక్షల కోసం బుధవారం సిఎం కెసిఆర్‌ను యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు సిటి స్కార్ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన యశోద ఆసుపత్రికి వచ్చారు. సిఎం కెసిఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు సైతం సాధారణంగానే ఉన్నాయని సిఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు. యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.
సిఎం ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయి: వైద్యులు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సిఎం కెసిఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు గురువారం రానున్నాయి. సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి కెటిఆర్, ఎంపి జె.సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
సిఎంకు ఆరు రకాల వైద్య పరీక్షలు
సిఎం కెసిఆర్‌కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సి రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్ పీ) డైమర్, ఐఎల్ 6, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిటి స్కాన్‌తోపాటు చెస్ట్ ఎక్స్ రే కూడా తీసినట్లు తెలిసింది. యశోద ఆసుపత్రిలో సుమారు 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 19న యాంటిజెన్ పరీక్ష చేయించుకోగా, ఆయనకు స్వల్పంగా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నిర్వహించగా, అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంఇచ వైద్యుల సలహా మేరకు సిఎం కెసిఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సిఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యులు బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

CM KCR’s health tests in Yashoda Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News