మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో బిజెపి పార్టీ, నరేంద్ర మోడీలకు ఓటు వేస్తే, వాళ్లు గెలిచారు కానీ, భారతదేశ ప్రజలు ఓడిపోయారని విమర్శించారు. ఆ ప్రజల్లో మన తెలంగాణ కూడా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు అయిందని పేర్కొన్నారు. శాసనసభలో ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితి కారణం ఏంటనేదాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆక్రోశాలపై ప్రజా జీవితంలో ఉన్న వారు చర్చ జరపాలని తెలిపారు. అలాంటి వాటికే పవిత్ర దేవాలయం ఈ శాసనసభ వేదిక అని పేర్కొన్నారు.అయితే అసలు విషయం పక్కన పెట్టి, ఇంకేదో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ రోజుకీ పక్షపాత ధోరణులు కనపడుతున్నాయని వాపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
కేంద్రం చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లు ఎపిలో ఖాతాలో వేశారని, ఏడేళ్లుగా అడుగుతున్నా, వాటిని ఇవ్వడం లేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, తెలంగాణకు నిధులు కేటాయించలేదని అడిగితే ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వం…ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారని, ఇప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూస్తున్నామని చెప్పారు. మితిమీరి అహంకార పూరితంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కేంద్రం చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయని…కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో తాగటానికి నీరులేదని పేర్కొన్నారు. రత్నగర్భం లాంటి ఈ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారని తెలిపారు. సిటిజన్‌షిప్ వదులుకునే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావటం లేదని వాపోయారు. తమ పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డు వస్తే తల్లిదండ్రులు పార్టీలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు. దేశంలో పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని, పరిశ్రమలు మూతబడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని విమర్శించారు.
మన్మోహన్ సింగ్ ఎక్కువ పని చేసి తక్కువ ప్రచారం చేసుకున్నారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి అని, పని ఎక్కువ చేస్తారు… ప్రచారం తక్కువ చేసుకుంటారని కెసిఆర్ అన్నారు. మోడీ కన్నా కూడా ఆయన ఎక్కువ పని చేశారని తెలిపారు. అయితే, ఆయన అవేవీ చెప్పుకోలేదని… మధ్యలో ఉన్నవాళ్లు, మన్మోహన్ సింగ్ పనిచేయలేదని డప్పు కొట్టి.. దేశాన్ని నమ్మించి గెలిచారని పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, జర్నలిస్టు అయిన పూజా మెహ్రా అనే రాసిన ‘ది లాస్ట్ డెకేడ్’ పుస్తకంలో దేశ ఆర్థిక పరిస్థితిని వివరించారని తెలిపారు. ఈ పుస్తకం అందరూ చదవాలని సూచించారు. మోడీ హయాంలో ఏ రంగంలోనైనా వృద్ధి జరిగిందా..? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8 ఉంటే, మోడీ వచ్చాక మన వృద్ధి రేటు 5.8కి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుపిఎ హయాంలో వృద్ధిరేటు 24 శాతం ఎక్కువ అని, కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోదీ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 ఉందని, మోదీ పాలనలో సగానికి సగం పడిపోయిందని కెసిఆర్ మండిపడ్డారు.
వాస్తవంగా ప్రధాని మోడీ స్థానంలో మన్మోహన్ సింగ్ ఉన్నా దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ జిఎస్‌డిపి రూ.16 లక్షల కోట్లు ఉండాలని కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఒక్క తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందని చెప్పారు. ప్రతి రంగంలో దేశం దెబ్బతిన్నదని తెలిపారు. దివాళా తీస్తూ కూడా తామే గొప్పవాళ్లమని అనుకుంటున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ద ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చిందని, ఆయన వ్యవహారం చూస్తుంటే దేశ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదని అన్నారు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం తప్పించేందుకు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతోంది..? అని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు అడుగుతుంటే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కమిటీ వేసి విచారణ జరుపుతామని కూడా చెప్పటం లేదని పేర్కొన్నారు.అదానీ సంస్థల్లో పలు బ్యాంకులతో పాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయబోతోందనే విషయాన్ని ‘ది ఎకానమిస్ట్’ తన కథనంలో రాసిందని వివరించారు.
అసలు విషయం పక్కన పెట్టి, మోదీ జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అదానీపై రభస జరుగుతోందని ప్రధాని మాటల్లో ఆక్రోశం కనిపించిందని ఆరోపించారు. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం చెబుతారు..? ప్రశ్నించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పెట్టుబడులు పెడతారని తెలిపారు. ఎంపి మహువా మోత్రి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని, సభలో ఆమె మాట్లాడుతుంటే సభలో బిజెపి సభ్యులు లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ సంస్థ ఏం చేసిందో తెలియదు..కానీ అదానీ సంపద 112 బిలియన్ డాలర్లు కరిగిపోయిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణలోనూ అదానీ పెట్టుబడులు పెడతామని వచ్చారని, కానీ మనం జాగా చూపించలేకపోయామని తెలిపారు. దాంతో మనం బతికిపోయామని అన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో చర్చ జరగాల్సింది ఇలాగేనా..?
నెహ్రూ, ఇందిరాగాంధీలు మరణించి ఎంతో కాలమైందని, కానీ ఇప్పటికీ వాళ్ల గురించి మాట్లాడుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని కెసిఆర్ కేంద్రాన్ని విమర్శించారు. 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తున్న మోదీ.. అదానీ విషయం చెప్పకుండా ఇతర విషయాలు పార్లమెంట్లో ప్రసంగిస్తున్నారని మండిపడ్డారు. నెహ్రూ, ఇందిరాలు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా..? అని ప్రశ్నించారు. వాళ్లు నెహ్రూ, ఇందిరాగాంధీల గురించి మాట్లాడుతుంటే మధ్యలో రాహుల్‌గాంధీ లేచి, మోదీ ఏం కూలగొట్టారో మాట్లాడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల వ్యవహారం చూస్తుంటే ‘చోటా భాయ్ శుభానల్లా.. బడే భాయ్ మాషాఅల్లా’ అన్నట్లుగా ఉందని చురకలంటించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో చర్చ జరగాల్సింది ఇలాగేనా..? అని ప్రశ్నించారు. చైనా, జపాన్ దేశాల పురోగతి ఎలా ఉందో చూడరా…? అని అడిగారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉందని, అయితే, అలా జరగడం లేదని సిఎం కెసిఆర్ అన్నారు.
ప్రధాని మోడీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారని, దాంతో ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ మాజీ ప్రధాని అయ్యేంతవరకు ఇలాం పొగడ్తలతో ముంచెత్తుతారని విమర్శించారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారని, అది చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి సూచిక అయిన తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉందని చెప్పారు. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువ అని పేర్కొన్నారు. జనాభాలో భారతదేశం చైనాను దాటి మొదటిస్థానానికి చేరిందని, ఇంత జనాభా ఉన్న దేశంలో ప్రభుత్వాలు ఎంత బాధ్యతతో ఉండాలని అన్నారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉందని, కానీ, అలా జరగట్లేదని వాపోయారు. పైగా అక్కడ అందరూ మోదీని పొగుడుతున్నారని విమర్శించారు. క్యాపిటల్ ఫార్మేషన్ మోదీ పాలనలో జరిగింది 31 శాతమే అని, మోదీ పాలనలో క్యాపిటల్ ఎక్స్‌పండేచర్, క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గిందని సిఎం అన్నారు.
ఎన్‌టిఎ అంటే నో డాటా అవైలబుల్
దేశంలో అదనపు జలాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా ఉపయోగిస్తే దేశంలో ప్రతి ఎకరానికీ నీరు అందించవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని దేని గురించి అడిగినా మాట్లాడదని విమర్శించారు. ఎన్‌టిఎ అంటే నో డాటా అవైలబుల్‌గా మారిందని విమర్శించారు. దేశ ఆర్థిక శాఖ మంత్రి వచ్చి కామారెడ్డిలో డీలర్ షాపు వద్ద ప్రధాని మోదీ ఫొటోలేదని కొట్లాడారని గుర్తు చేశారు. ఆ డీలర్ ఏం చేస్తారు పాపం…ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారని అన్నారు. ఒక దేశ ఆర్థిక మంత్రి రేషన్ డీలర్‌తో కొట్లాడతారా..? అని ప్రశ్నించారు. ఏం సాధించారని మోడీ ఫొటో పెట్టుకోవాలని అడిగారు.
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీకి అడిగితే ఇవ్వలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేని భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు అయినా ఎందుకు వేయాలని తాము ప్రజలను అడుగుతామని అన్నారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతారని చెప్పారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒకటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని…ఇది ప్రజాస్వామ్యమా..? కో -ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. 157 నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే, తెలంగాణకు ఒకటి కూడా రాదా..? అని అడిగారు. కేవలం తెలంగాణకు మాత్రమే కాదు… ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా జరిగినట్టే అని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినా ఇప్పటికీ దిగ్గులేదని మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి సత్యవతి రాథోడ్ నాలుగైదు సార్లు ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారని, అయినా ఫలితం లేదని తెలిపారు. దేశ వృద్ధిలో తెలంగాణ సహకారం ఎంతో ఉందని చెప్పారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 3 శాతం ఉంటే, జిడిపిలో 4.9 శాతం వాటా ఉందని వివరించారు. అలాంటి తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దనోట్ల రద్దుపై మోడీ చెప్పింది వేరు.. చేసింది వేరు
పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు తాను ప్రధాని మోడీని కలిశానని, అయితే ఈ విషయంలో ఆయన చెప్పింది వేరు.. చేసింది వేరు అని సిఎం తెలిపారు. నల్లధనం పోతుంది… డిజిటల్ కరెన్సీ వస్తుంది… ఉగ్రవాదులకు డబ్బులు దొరక్కుండా పోతాయి… నగదు చలామణి తగ్గుతుంది అని మోడీ చెప్పిన మాటలు నమ్మి తానూ ఒకే చెప్పానని తెలిపారు. నోట్ల రద్దుకు ముందు రూ.15.-16 లక్షల కోట్ల నగదు చలామణి ఉంటే, ఇప్పుడు రూ.32.43 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉన్నట్లు వాళ్లే చెబుతున్నారని అన్నారు. అసలు ఏ పాలసీ సక్సెస్ అయిందని విమర్శించారు. వడ్లు కొనమంటే కొనరు…. అదేమంటే, ప్రజలకు నూకలు తినడం నేర్పండి అంటారా..? అని నిలదీశారు. కేంద్రానికి ఎంత అహంకారం..? అని ప్రశ్నించారు. తమపై ఎన్నికుట్రలు చేశారో ఈటెల రాజేందర్ సహా అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
అప్పులు చేయడంలో మోడీ ఘనుడు
అప్పులు చేయడంలో మోడీని మించిన ఘనుడు లేడని సిఎం కెసిఆర్ విమర్శించారు. మోదీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ పక్కదేశాల చూసి నేర్చుకోవాలని, అప్పులు చేయొద్దని చెప్పారని, కానీ, అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేరని అన్నారు. మన్మోహన్ పాలనతో పోల్చితే.. మోదీ పాలనలో దేశంలో ఘోరంగా దెబ్బతిన్నదని, ఇంకా మోడీనే లొల్లిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇతర దేశాలలో రైళ్లు, ట్రక్కుల వేగం గణనీయంగా ఉందని, కానీ దేశంలో అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైల్ బర్రె గుద్దితే పచ్చడి పచ్చడి అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ రైళ్లను 14 సార్లు ప్రారంభించారని, ఒక ప్రధాని రైళ్లను ప్రారంభిస్తారా…? అని విమర్శించారు. కేంద్రమంత్రి వచ్చి లిఫ్టును జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు.
అందుకే బిఆర్‌ఎస్
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తెలంగాణపై ఎన్నో అడ్డంకులు సృష్టించిందని, అన్నీ తట్టుకుని నిలబడ్డామని కెసిఆర్ తెలిపారు. నీళ్లు తీసుకొచ్చాం… చెరువులు తవ్వించాం… చెక్ డ్యాంలు కట్టామని తద్వారా మన రైతులు పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో రెండో ర్యాంకులో ఉన్నామని, కచ్చితంగా మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. కృష్ణా జలాల లెక్క తేల్చడానికి 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారని, దాదాపు 20 ఏళ్లయినా ఇప్పటికీ నీళ్ల వాటా తేలలేదని చెప్పారు. ఇప్పటికీ ఏ విషయమూ తేల్చరా..? జలాల పంపిణీ లెక్కకే 20 ఏళ్లు పడితే, ఇక అనుమతులు ఎప్పుడు రావాలి..? డిజైన్లు ఎప్పుడు ఫైనల్ కావాలి..? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి..? ప్రజలకు నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి..? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేయలేకపోయింది… వదిలేయండి. బిజెపి ప్రభుత్వం చేయొచ్చు కదా.. అని అడిగారు. పాలసీ బాగలేకపోలే మార్చండి…కొత్త చట్టం తీసుకురండి అని పేర్కొన్నారు. ఇప్పుడు బిజెపి వల్ల కూడా ఆ పని కావడం లేదని… అందుకే బిఆర్‌ఎస్ అని వెల్లడించారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయిన నాలుగైదు రోజులకు తాను ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. వాళ్లను, వాళ్లను విధానాలను చూసి, చూసి విసిగి వేసారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఈ పరిస్థితుల్లో చూడలేక, రిటైర్ అయ్యే సమయంలో బిఆర్‌ఎస్ పెట్టుకున్నామని తెలిపారు. దేశంలో నీళ్ల యుద్ధాలు బంద్ కావాలి. ఎందుకంటే దేశంలో అదనపు జలాలు ఉన్నాయి అని వివరించారు. తాను భారతీయుడినని… దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందాలి.. ఒకరికి ఒకరు సహకారం అందించుకోవాలని చెప్పారు. మహారాష్ట్రతో సంప్రదింపులు చేసి మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోలేదా..? అని పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న 40 వేల టిఎంసి నీళ్లను వినియోగించుకుంటే దేశమంతా సుభిక్షం అవుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో నీటి కోసం యుద్ధాలే ఉండవని, మరో 10వేల టిఎంసిలను తాగునీటికి, పరిశ్రమలకు ఇచ్చినా, దాదాపు 25 వేల టిఎంసిలు అదనంగా ఉంటాయని వివరించారు. దీనికోసం ప్రపంచబ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. అందుకు విశ్వగురు అంతకన్నా అవసరం లేదని… దేశ గురువులు ఉంటే చాలు అని పేర్కొన్నారు.
దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. వాక్ శుద్ధి… చిత్తశుద్ధి… సంకల్ప శుద్ధి ఉంటే నిజం ప్రజల మేలు కాంక్షిస్తే భగవంతుడు కూడా ఆశీర్వదిస్తారని తెలిపారు. 2014లో తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నా…తెలంగాణ రాష్ట్రంలో ఫ్లైట్ దిగుతా అని చెప్పానని, అది నిజమైందని గుర్తు చేశారు. ఈ దేశంలో ఇరిగేషన్ పాలసీ తీసి బంగాళాఖాతంలో పడేయాలి… భవిష్యత్‌లో తమ ప్రభుత్వం వస్తుందని, తాము చేసి చూపిస్తామని అన్నారు. తాము దేశంలో కొత్త జల విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఐదారేళ్లలో దేశంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తరహాలో తాగునీరు అందిస్తామని తెలిపారు.
ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోదు
రాష్ట్రంలో ఎంత ఖర్చయినా సరే ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోనీయమని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోనీయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొంత సమయంలో కరెంట్ పోవడంపై ఇటీవల తాను అధికారులతో సమీక్ష జరిపానని, అయితే గ్రిడ్ లోడ్ బ్యాలెన్స్ లేకుంటే కరెంట్ కట్ చేస్తారని, గ్రిడ్ పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు కొంత సమయంలో కరెంట్ తీయవలసి వస్తుందని అధికారులు తెలిపారని చెప్పారు. ఈ విషయంపై అవగాహన లేకుండా 24 గంటల కరెంట్ కావాలంటూ ఎవరో ధర్నా చేశారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అందుకు 20 వేల కోట్ల అవసరమవుతందని చెప్పారని, 20 వేల కోట్లయినా, 30 వేల కోట్లయినా ఇస్తామని కరెంట్ పోకుండా చేయాలని తాను అధికారులను ఆదేశించానని వివరించారు. ఇక నుంచి ఎంత ఖర్చు అయినా సరే ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదు…పోనీయం అని సిఎం స్పష్టం చేశారు. 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సమస్య లేకుండా విద్యుత్ ఇస్తామని తెలిపారు.
దమ్మున్న ప్రధాని ఉంటే కరెంట్ ఎందుకు రాదు…? అని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్ ఇస్తున్నారా..? అని అడిగారు. ఇన్వర్టర్లు, కన్వర్టర్ల అవసరం ఇక రాదని తెలిపారు. దమ్మున్న ప్రధాని ఉంటే దేశంలో 24 గంటల విద్యుత్ ఎందుకు సాధ్యం కాదు..? అని ప్రశ్నించారు. రైతు వేదికలు దేశంలో ఎక్కడా లేవని, కానీ రైతు వేదికలు ఏర్పాటు చేశామని తెలిపారు. దమ్మున్న ప్రభుత్వం ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయని, ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి పారుతున్నాయని, కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో… రేపు మా డబ్బాల్లో కూడా ఓట్లు పారుతాయని చెప్పారు. దేశంలో 361 బిలియన్ టన్నుల కోల్ నిల్వలున్నాయని, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకోవాలని కెసిఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచామని తెలిపారు. తాను ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కంటే అధికంగా జీతాలు పెంచామని, మరింత పెంచుతామని చెప్పారు. చిరు ఉద్యోగులకు కూడా రెగ్యులర్ వారి మాదిరిగానే జీతాలు పెంచుతామని అన్నారు. విపక్ష సభ్యుల సూచనల మేరకు డైట్ ఛార్జీలు పెంచాలని మంత్రులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
నేను చెప్పే విషయాలలో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తా
ప్రధాని నరేంద్ర మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగ్గా ఇవ్వడం లేదని సిఎం అన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లపై బిబిసి ఛానల్ డాక్యుమెంటరీ తీశారని, అయితే ఆ ఛానల్‌ను బ్యాన్ చేయాలని బిజెపి పార్టీకి చెందిన న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిబిసి అంటే జీ న్యూసా…? ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు.. బిబిసి…. నీ ఇడి, బోడీలకి భయపడుతుందా..? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది..?… 2024 తర్వాత అంతా కుప్పే మిగులుతుందని పేర్కొన్నారు. గతంలో బంగ్లాదేశ్ యుద్దం గెలిచినప్పుడు ఇందిరాగాంధీని దుర్గామాత అంటూ వాజ్‌పేయీ పొగిడారని తెలిపారు.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందిరాగాంధీ జీవితం మలుపు తిప్పిందని చెప్పారు. ఇందిరను కూడా ప్రజలు ఇంటికి పంపారని సిఎం గుర్తు చేశారు. పనితీరు బాగా లేకున్నా మోడీని పొగుడుతున్నారని విమర్శించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన.. లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఎల్‌ఐసీని అమ్మాల్సిన అవసరం ఏంటని, ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాలకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పిన విషయాలలో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని సిఎం కెసిఆర్ సవాల్ విసిరారు. ప్రధాని మోదీకి ఓట్లు అక్కెర ఉంటే బియ్యం ఫ్రీ అని చెబుతాడని విమర్శించారు. అవి తినాలి ఓట్లు గుద్దాలి.. తెల్లారి మళ్లీ నెత్తిపై గుద్దాలి.. ఇదీ మోదీ దుకాణం అని పేర్కొనారు. మిగతా వారు ఫ్రీగా ఇస్తే రేవ్‌డీ కల్చర్ అంటారని మండిపడ్డారు.
దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే
దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీయే అని కెసిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్.. మోడీ హయాంలో సైలెన్స్ రాజ్ అని పేర్కొన్నారు. తను మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోడీని లేదని ఆరోపించారు. రూ.20 లక్షలు కోట్లు ఎంఐఎంఇలకు ఇచ్చామని చెబుతున్నారని, ఎవరికి ఇచ్చారు..? అని ప్రశ్నించారు. కేంద్రం దగ్గర దేనికీ లెక్కలుండవని తెలిపారు. ఎన్‌పిఎల పేరుతో కార్పోరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేశారని సిఎం కెసిఆర్ మండిడ్డారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంతో అవకాశం ఉంది
దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంతో అవకాశం ఉందని.. అదానీ, అంబానీలకు కాదు.. రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మనదేశంలో జనాభాలో చైనాను దాటి మొదటిస్థానానికి చేరిందని తెలిపారు. 1871 నుంచి ఇప్పటి వరకు 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదని, కానీ ఇప్పుడు కేంద్రం జనాభా గణన చేపట్టడం లేదని విమర్శించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదని పేర్కొన్నారు. మరి ఇప్పుడు మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. జనాభా లెక్కలు జరిగితే బిజెపి బండారం బయటపడుతుందని కేంద్రం భయపడుతోందని ఆరోపించారు. జనాభా గణన చేయాలని బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు అడుగుతున్నారని తెలిపారు. దేశంలో ఎస్‌సిల జనాభా పెరిగిందని అన్నారు. ఎప్పుడో జరిగిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. జనాభా లెక్కలు తేలితే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరుగుతాయని ఆయా సామాజిక వర్గాలు ఆశపడుతున్నాయని చెప్పారు.
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాం
తెలంగాణ సచివాలయానికి తాము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టలేదని చెప్పారు. పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కోరామని, కానీ పెట్టడం లేదని విమర్శించారు. అందరు తియ్యని మాటలు చెప్పారు కానీ అంబేద్కర్ తగిన గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు. అమెరికాలో నల్లజాతీయుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడిని చేసి నల్లజాతీయులకు చేసిన పాపాన్ని వారు కడిగేసుకున్నారని, అలాగే దేశంలో దళితులకు జరిగిన పాపాన్ని కడిగేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయాన్ని కూల్చేస్తామని అంటున్నారని, కూల్చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? చేతులు, రెక్కలు విరిసి జనమే నలుస్తారని పేర్కొన్నారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గెలిచారు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గెలిచారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పెన్షన్లు పొందుతూ 46 లక్షల మంది ప్రజలు గెలిచారని, బిందె నీళ్ల కోసం ఇబ్బంది పడిన మహిళా లోకం గెలిచిందని, రైతుబంధు,రైతుబీమా ద్వారా రైతులు గెలిచారని, భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఇబ్బండి పడిన రైతులు ధరణి ద్వారా గెలిచారని వెల్లడించారు. ధరణి రద్ద చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, ధరణిని తీసేస్తే బ్రోకర్లు గెలుస్తారని విమర్శించారు. దళితబంధు ద్వారా దళితబిడ్డలు, తమ గూడెం తమ పాలన, 10 శాతం రిజర్వేషన్లతో గిరిజన బిడ్డలు గెలిచారని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో గౌడన్నలు, చేనేత కార్మికులు, గొల్లకుర్మలు, మత్సకారులు గెలిచారని చెప్పారు. గురుకులాలు, విదేశీ విద్యకు ఓవర్సీస్ పథకం ద్వారా బాలబాలికలు గెలిచారని, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది పడే 12 లక్షల కుటుంబాలు కళ్యాణలక్ష్మి ద్వారా గెలిచారని, కెసిఆర్ కిట్ ద్వారా 14 లక్షల మంది మహిళలు గెలిచారని చెప్పారు. కంటి వెలుగు ద్వారా ఇప్పటివరకు కోటిన్నర మంది కళ్లద్దాలు పంపిణీ చేశామని, కళ్లద్దాలు పూర్తిగా మేడిన్ తెలంగాణ అద్దాలు అని అన్నారు.
కంటిచూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులు ఈ పథకం ద్వారా గెలిచారని పేర్కొన్నారు. అంధత్వ నివారణకు కంటివెలుగు ద్వారా సిఎం కెసిఆర్ ప్రపంచానికి దారిచూపారని ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్ ఛైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వర్‌రావు ప్రశంసించారని గుర్తు చేశారు. దేవాలయాలలో పూజలు చేసే పూజారులు రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వడం ద్వారా పూజానాలు గెలిచారని, 95 శాతం స్థానికులకు రిజర్వేషన్లతో తెలంగాణ యువత గెలిచిందని తెలిపారు. కాళోజీ, దాశరథుల పేర్ల మీద అవార్డులు పొందుతూ కవులు, కళాకారులు గెలిచారని చెప్పారు. లాభాలలో వాటాలతో సింగరేణి కార్మికులు గెలిచారని, టిఎస్‌ఐపాస్ ద్వారా ఎలాంటి మధ్యవర్తులు, లంచాలు లేకుండా అనుమతులు పొందుతూ పారిశ్రామిత్తలు గెలిచారని, బిఎస్‌బిపాస్ ద్వారా సులువుగా అనుమతులు పొందుతూ బిల్డర్లు గెలిచారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక్క పార్కు, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామాలతో పల్లెలు గెలిచాయని సిఎం కెసిఆర్ వెల్లడించారు.
అసెంబ్లీ వేదికగా మోడీకి చేతులు జోడించి కెసిఆర్ విజ్ఞప్తి
తెలంగాణపై కేంద్రం పక్షపాతాన్ని మానుకోవాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీకి చేతులు జోడించి చెబుతున్నా..తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణిని మానుకోవాలని అన్నారు.