నర్సంపేట: రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే సిఎం కెసిఆర్ ధేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందిన 26 మంది రైతు కుటుంబాలకు రూ. 1.30 కోట్ల విలువైన రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గవ్యాప్తంగా రూ. 98,65,1973 రైతు బీమా చెక్కులను అందచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ తలపెట్టిన రైతు బీమా పథకం వల్ల యావత్తు తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు అకాల మృతి చెందితే వారిపై ఆ ధారపడ్డ కుటుంబం రోడ్డు పడుతుంది.
రైతు ఏదైనా కారణం చేత అది సహజమైనా, ప్రమాదవశాత్తయినా మృతి చెందితే ఆ రైతు కుటుంబం దిక్కులేనిది కావొద్దని తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రీమియం చెల్లించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌తో అగ్రిమెంటు చేసుకుని మృతి చెందిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా మూడు నెలల్లోపే సిఎం కెసిఆర్ రైతు కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందించే ప్రతీ పథకం పేదరికాన్ని నిర్మూలించేందుకు రూపుదిద్దుకున్నదని గుర్తుచేస్తూ వారి సంక్షేమం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు.
ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు పిల్లల చదువు కోసం సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఇంత పెద్ద పథకం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్నందుకు, అందుకు కృషి చేస్తున్న నియోజకవర్గ వ్యవసాయాధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆర్‌ఎస్‌ఎస్ డైరెక్టర్లు, రైతు బంధు కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వ్యవసాయాధికారులు, ఏఈఓలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.