పశ్చిమబెంగాల్ లో సంభవించిన వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి రెండో లేఖ రాశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ప్రజలు వరదబారిన పడి తీవ్రంగా నష్టపోయారని, వెంటనే కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆమె లేఖలో కోరారు. తమ ప్రభుత్వ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయని పేర్కొన్నారు. ప్రధానికి మమతాబెనర్జీ రాసిన తొలిలేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ డివిసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశ లోనూ రాష్ట్ర అధికారులకు తగిన సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.
ఇది ఏకపక్ష నిర్ణయం : మమత ఆరోపణ
కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ వివరణపై మమతాబెనర్జీ తప్పుపట్టారు. డీవీసీ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల అనేది దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుందని, అయితే ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాల్సి ఉంటుందని వివరించారు. అయితే అలా జరగలేదన్నారు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్ర జలకమిషన్ ప్రతినిధులు, జలశక్తి మంత్రిత్వశాఖ , కేంద్రం ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్నారని మమతాబెనర్జీ ఆరోపించారు. కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీటిని విడుదల చేశారని మమత తప్పుపట్టారు. ఇక రిజర్వాయర్ల నుంచి నీటిని తొమ్మిది గంటల పాటు ఏకధాటిగా విడుదల చేయడానికి ముందు స్వల్ప వ్యవధిలో సమాచారం ఇచ్చారన్నారు. ఆ కొద్ది సేపటిలో అత్యవసర సహాయక చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు.