Friday, November 15, 2024

మోడీ దేశంగా పేరు మారుస్తారేమో: మమత

- Advertisement -
- Advertisement -

మోడీ దేశంగా పేరు మారుస్తారేమో: కొల్‌కతా మహిళా ర్యాలీలో మమత
స్టేడియం, టీకా పత్రాలపై ఫోటోలు
బెంగాల్‌కు వచ్చి అసత్య ప్రచారాలు

కొల్‌కతా: ఈ దేశానికి మోడీదేశంగా పేరు మార్చే రోజు దగ్గర్లోనే ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని మోడీ వైఖరి శృతిమించుతోందని, చివరికి పౌరులు కొవిడ్ టీకా వేసుకున్నట్లు తెలిపే సనదు పత్రాలపై కూడా ఈ ప్రధాన మంత్రి గారి ఫోటోలు ఉంటున్నాయని విమర్శించారు. ఆయన తనకు తానుగా విస్తరించుకుపోతున్నాడు, చివరికి ఈ దేశం పేరు మోడీ దేశంగా మారడానికి మరెంతో కాలం పట్టదన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మమత బెనర్జీ ఇక్కడ జరిగిన ర్యాలీకి సారథ్యం వహించారు. ఈ సందర్భంగా ఆమె మోడీని తూర్పార పట్టారు. ప్రధాని అయి ఉండి అబద్ధాలు చెపుతున్నాడు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు, కట్టుకథలకు దిగుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వాన్ని పట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మొత్తం 294 నియోజకవర్గాలలోనూ ఈసారి దీదీ బిజెపి మధ్య పోటీ ఉంటుందని ఓటర్లకు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కొవిడ్ టీకాల కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి కూడా చెపుతూ వస్తున్నారు. కానీ కేవలం ప్రచారం కోసం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో లబ్థికోసం చివరికి ఈ టీకాల పంపిణీని కూడా తన ఆర్బాటపు చర్యలలో భాగంగా వాడుకుంటున్నాడని విమర్శించారు. బిజెపి , మోడీలు ఎన్ని విధాలుగా డ్రామాలకు దిగినా తమ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. ఇది తమకు వరుస క్రమపు మూడో విజయం అవుతుందని సగర్వంగా టిఎంసి అధినేత్రి ప్రకటించారు. టిఎంసి బిజెపి మధ్య పోరు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
వారికి బెంగాల్‌తో ఎన్నికల బంధం
బిజెపి వారికి బెంగాల్ పట్ల ఎన్నికలప్పుడే ప్రేమ పుడుతుంది. ఈ దశలోనే ఇక్కడికి వచ్చి వాలుతారు. లేనిపోని, ఉన్నవి లేనివి కట్టుకథలు చెపుతారని విమర్శించారు. ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి మహిళా భద్రతపై పాఠాలు చెపుతున్నారని, మరి బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళ పరిస్థితి గురించి ఏం మాట్లాడుతారని మమత ప్రశ్నించారు. యుపి, మధ్యప్రదేశ్, చివరికి మోడీకి ప్రాణం అయిన గుజరాత్‌లో పరిస్థితి ఏమిటని నిలదీశారు. మోడీ, అమిత్ షాలు ముందు బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళల దారుణ పరిస్థితిపై దృష్టి సారించాలని చురకలు పెట్టారు. తానేదో అబద్ధాలు చెప్పడం లేదని, ఓ మీడియా రిపోర్టు ప్రకారమే మోడీ మోడల్ రాష్ట్రం గుజరాత్‌లో ప్రతి రోజూ గత రెండేళ్లుగా నాలుగు రేప్‌లు, రెండు హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. మరి ఇక్కడి పరిస్థితి గురించి ఆయన కానీ ఆయన ఆంతరంగికులు కానీ ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు.
స్టేడియానికి ఆయన పేరేనా
గుజరాత్‌లో ఓ స్టేడియానికి ప్రధాని తమ పేరు పెట్టుకున్నారని, కొవిడ్ సర్టిఫికెట్లపై ఫోటోలు తగిలించుకుంటున్నారని, ఇదే క్రమంలో భారతదేశం పేరు కూడా మారుస్తారని అన్నారు. ఈ పరిస్థితిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. టిఎంసి ఆధ్వర్యంలో జరిగిన మహిళా ర్యాలీ ఇక్కడి కాలేజ్ స్కేర్‌లో ఆరంభం అయ్యి డోరినా క్రాసింగ్ వద్ద ముగిసింది. మమత ముందుండగా సాగిన ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలు చంద్రిమా భట్టాచార్య, మాలారాయ్ ఉన్నారు. నటి, టిఎంసి అభ్యర్థినిలు జూన్ మాలియా, సయోని ఘోష్, సయంతిక్ బెనర్జీ వంటి వారు కూడా ఉన్నారు.

CM Mamata Banerjee slams PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News