కోల్‌కతా: ఈ నెల 27న న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర సెక్రటేరియట్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఢిల్లీలో ఈ నెల 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన ఒక రోజు తర్వాత మమత నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ సమావేశానికి వెళ్లకూడదని మమత తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేమిటో తెలియనప్పటికీ వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడానికి బిజెపియేతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్న దృష్టా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఆ ఉన్నతాధికారి చెప్పారు. తాను నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తానని, కేంద్రం రాష్ట్రం పట్ల సవతి తల్లి ధోరణితో వ్యవహరిస్తూ ఉండడాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావిస్తానని మమత ఇంతకు ముందు చెప్పారు. అయితే మారిన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకొని ఉంటారని భావిస్తున్నారు.