కోల్‌కత: పట్టాలు తప్పడంలో భారతీయ రైల్వేలు ప్రపంచ రికార్డును సృష్టించాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని జల్పాయ్‌గురి జిల్లాలో ఒక గూడ్సు రైలుకు చెందిన కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పిన కొన్ని గంటల్లోనే మమతా బెనర్జీ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రైల్వేలకు ఏమైంది? ఈరోజు కూడా రైలు పట్టాలు తప్పినట్లు వార్తలు వచ్చాయి. పట్టాలు తప్పడంలో రైల్వేలు ప్రపంచ రికార్డును సృష్టించాయి. కాని..దీనిపై ఎవరూ పెదవి విప్పడం లేదు అని సచివాలయంలో పరిపాలన సమీక్షా సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రజల రక్షణ, భద్రత ప్రమాదంలో పడ్డాయని, రైలులో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారని ఆమె అన్నారు.
రైల్వే మంత్రి ఎక్కడున్నారు? ఎన్నికల సమయంలో ఓట్లు మాత్రం అడిగితే సరిపోదు. ప్రమాదంలో ఉన్నపుడు ప్రజల పక్కన ఉండాలి అంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఉద్దేశించి ఆమె విమర్శించారు. గతంలో రెండుసార్లు రైల్వే మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ తన హయాంలో రైల్వే శాఖ సజావుగా నడిచిందని, పశ్చిమ బెంగాల్‌కు అనేక ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు. రైల్వే మంత్రిగా బెంగాల్‌కు రూ.2 లక్షల విలువైన ప్రాజెక్టులను తాను మంజూరు చేసినట్లు ఆమె చెప్పారు. కాగా..ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా రైళ్లను పట్టాలు తప్పించడానికి 18 ప్రయత్నాలు జరిగినట్లు రైల్వే శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది.