Monday, January 20, 2025

రేపిస్టులకు కఠిన శిక్షలు పడాలి: ప్రధానికి మమత లేఖ

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండు చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు ఆలాపన్ బందోపాధ్యాయ గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖను చదివి వినిపించారు. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక పిజి ట్రెయినీ డాక్టర్ ఇటీవల హత్యాచారానికి గురి కావడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానికి మమత లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతుండడాన్ని ఆమె ప్రస్తావిస్తూ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రోజూ సుమారు 90 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, బాధితులలో చాలామంది హత్యకు గురవుతున్నారని మమత తన లేఖలో పేర్కొన్నారు.

ఈ పోకడలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె తెలిపారు. మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామన్న భావన కలిగించేందుకు ఈ పోకడలను అంతం చేయాల్సిన బాధత్య తమపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ దారుణ నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రం చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కేసులపై త్వరితంగా విచారణ జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. బాధితులకు త్వరితంగా న్యాయం లభించేందుకు వీలుగా విచారణను 15 రోజుల్లో ముగించాలని కూడా ఆమె సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News