Friday, December 20, 2024

పరిష్కరిస్తారా?.. సిబిఐకి అప్పగించాలా?: డాక్టర్ హత్య కేసుపై పోలీసులకు సిఎం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

పోలీసులు ఆగస్టు18 లోపు విఫలమైతే సిబిఐకి అప్పగిస్తాం
సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టులు మూడు పిల్‌లు

కోల్‌కతా : ఆర్‌బి కార్ ఆసుపత్రి డాక్టర్ హత్య కేసును పోలీసులు ఆదివారం (18) నాటికి పరిష్కరించని పక్షంలో హత్య దర్యాప్తు బాధ్యతను సిబిఐకి తన ప్రభుత్వం అప్పగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును విచారించాలని తాను కోరుకుంటున్నట్లు కూడా మమత తెలియజేశారు. ‘పోలీసులు దీనిని ఆదివారం నాటికి పరిష్కరించలేకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తాం.

అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ విజయం రేటు చాలా తక్కువగా ఉంది’ అని మమత కోల్‌కతాలో దివంగత డాక్టర్ నివాసం సందర్శన అనంతరం విలేకరులతో చెప్పారు. ఇది ఇలా ఉండగా, ఆ మహిళా డాక్టర్ అత్యాచారంపై సిబిఐ దర్యాప్తు కోరుతున్న కనీసం మూడు పిల్‌లను కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించనున్నది.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి బదలాయించాలని కోరుతూ కనీసం మూడు పిల్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ముందు దాఖలయ్యాయి. పిల్‌లను, దీనికి సంబంధించిన ఏవైనా ఇతర పిటిషన్లను మంగళవారం విచారణకు చేపడతామని బెంచ్ తెలియజేసింది. బెంచ్‌లో న్యాయమూర్తి హిరణ్మయ్ భట్టాచార్య కూడా ఉన్నారు. మహిళా డాక్టర్ మృతదేహం ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో శుక్రవారం కనిపించింది. హత్యకు ముందు ఆమెపై లైంగిక అత్యాచారం జరిగిందని ప్రాథమిక అటాప్సీ నివేదిక సూచించింది. ఈ హత్య సందర్భంగా ఒక వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News