తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎంతమంది చిన్నారులు అనాథలుగా మారారో ఊహించలేము. కరోనా కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి పిల్లలకు రూ. 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని, వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకోవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శనివారం ప్రకటించారు. తల్లిదండ్ర్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ. 3లక్షలకు సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా అనాథలైన చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలను కూడా తమ ప్రభుత్వమే తీసుకుంటుందని స్టాలిన్ చెప్పారు. డిగ్రీ పూర్తయ్యేంత వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో వారికి వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకవేళ హాస్టళ్లలో కాకుండా బంధువుల ఇళ్లలో ఉండేవారికి ప్రతి నెలా రూ. 3,000 సాయం అందజేస్తామని వెల్లడించారు. అనాథలైన పిల్లల మంచిచెడ్డలు చూసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారినందరినీ తక్షణం ఆదుకోవాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.