చెన్నై : తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రజలకు ప్రత్యేక పొంగళ్ కానుక అందించారు. రేషన్‌కార్డులు ఉన్న వారికి తమిళుల పొంగళ్ పర్వదినం నేపథ్యంలో ప్రతికుటుంబానికి రూ 1000 నగదు, చెరకుగడ ముక్కలు, కిలో ముడిబియ్యం, చక్కెర అందించే కార్యక్రమాన్ని సిఎం బుధవారం ఇక్కడ ఆళ్వారుపేటలో లాంఛనంగా ఆరంభించారు. వ్యవసాయ పంటల కోతల పర్వదినంగా పొంగళ్ తమిళుల సంస్కృతిలో ఘనంగా జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికిపై రేషన్‌కార్డుదార్లందరికీ ఈ పొంగళ్ కానుక అందుతుందని అధికారులు ప్రకటించారు. వీరితో పాటు పునరావాస శిబిరాలలోని శ్రీలంక తమిళులకు కూడా సంఘీభావంగా ఈ సహాయ పథకం వర్తింపచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం ఆరంభమైంది. ఇదే విధంగా లబ్ధిదారులకు ఉచితంగా ధోవతులు, చీరెల పంపిణీ కూడా ఆరంభించారు.
రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల ఇరవైలక్షల మందివరకూ రేషన్‌కార్డు హోల్డర్లకు అందించే ఈ ఉచిత పొంగళ్ కానుకకు అయ్యే ఖర్చు దాదాపు రూ 2.436.19 కోట్లుగా అంచనావేశారు. రాష్ట్రంలో 1.77 కోట్ల ధోవతులు, ఇదే సంఖ్యలో చీరల పంపిణీ కూడా చేపడుతున్నారు. నిరుపేద, సామాన్య ప్రజలకు ఈ ఉచితకానుకలతో మేలు జరుగుతుంది. పైగా రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల రంగానికి ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయని అధికారులు తెలిపారు. ఉచిత పంపిణీలకు ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టారు. లబ్ధిదారులకు ముందుగానే టోకెన్లు అందించారు. ఇందులో వారికి కానుకలు అందే తేదీ సమయం ఖరారు చేసి పెట్టారు. ఈ టోకెన్లను తీసుకుని వారు ఆయా సమయాలలో రేషన్‌షాపులకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లాంఛనప్రాయంగా బుధవారం ఆరంభమైన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆర్ శక్కరపని, కెఆర్ పెరియకరప్పన్, మా సుబ్రమణియన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.