చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో 1989లోజయలలిత చీరలాగారనే వాదనను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తోసిపుచ్చారు. అటువంటిదేమీ జరగలేదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. తనకు ఏదో జరిగిందని సానుభూతి పొందేందుకే అప్పట్లో ఆమె కట్టుకథలకు దిగిందని విమర్శించారు. ఈ దశలో అసెంబ్లీలో ఉన్న వారందరికి నిజాలు తెలుసునని, తనకు అవమానం జరిగిందనే నాటకాన్ని రక్తికట్టించారని చెప్పారు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న జయలలిత చీరలాగారని, ఆమె పరిస్థితి ద్రౌపదీగా మారిందని ఇటీవల లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ దశలో చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె ధోరణిపై విమర్శలకు దిగారు. ఆర్థిక మంత్రి ఏ ఆధారంతో ఈ విధంగా మాట్లాడుతున్నారని డిఎంకె నేత అయిన స్టాలిన్ నిలదీశారు. ఏదో ఒక వాట్సాప్ పాతకథను ఆధారంగా చేసుకుని గౌరవనీయ మంత్రి అనుచితంగా జరగనిది జరిగినట్లు చెప్పారని, ఇది ఎవరిని అవమానించడానికి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు పలువురు ప్రముఖ నేతలు సభలో ఉన్నారని, ఎవరూ కూడా దుర్ఘటన జరిగిందని చెప్పలేదని స్టాలిన్ వివరించారు.
అన్నాడిఎంకె మాజీ నేత, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపి అయిన తిరునవుక్కరసర్ ఇంతకు ముందు చెప్పిన విషయాలను తాను ఇప్పుడు ప్రస్తావించుతున్నట్లు తెలిపారు. సభలో అవమానం ఘటన సృష్టికి మహానటి అయిన జయలలిత చాలాకాలమే రిహార్సల్ చేశారని తిరునవుక్కరసర్ చెప్పారని గుర్తు చేశారు. అయినా జరగనిది జరిగినట్లుగా జయలలిత చిత్రీకరించుకోవడం, ఇన్నేళ్లుకు నిర్మలా సీతారామన్ దీనిని మరో సారి అభూతకల్పనగా చిత్రీకరించడం దేనికని స్టాలిన్ ప్రశ్నించారు. కాగా అన్నాడిఎంకె సీనియర్ నాయకులు ఎడప్పాడి కె పళని స్వామి స్టాలిన్ వాదనను తిప్పికొట్టారు. నిండు సభలో అటువంటి ఘటన జరిగిందని , సంబంధిత విషయంపై వివరాలు వార్తాలుగా కూడా వచ్చాయని తెలిపారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నారని, పభలో తాను ఎమ్మెల్యేనని, ఈ దశలోనే ఆమెపై దాడి జరిగిందని , ఏదో చెప్పాలని చెప్పి స్టాలిన్ తమ పార్టీ తప్పు కప్పిపుచ్చుకోగలరా? అని ఈ మాజీ సిఎం ప్రశ్నించారు. సభలో ఇంతటి అవమానం జరిగిందని తరువాత ప్రజలే డిఎంకెను చిత్తుగా ఓడించి పగతీర్చుకున్నారని, తిరిగి ఆమె సిఎం అయ్యారని స్వామి తెలిపారు.