Sunday, December 22, 2024

ఓట్ల కోసం తమిళులపై దుష్ప్రచారం చేయొద్దు: స్టాలిన్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఖజానా తాళాలు గల్లంతై తమిళనాడుకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఇది కేవలం ఓట్ల కోసం తమిళులపై సాగిస్తున్న దుష్ప్రచారమని తిప్పి కొట్టారు. తమిళులకు వ్యతిరేకంగా ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలని మోడీకి హితవు పలికారు. ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఒడిశాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వం లోని బీజేడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పూరీ జగన్నాథస్వామి రత్నభండారం (ఖజానా) తాళాలు గల్లంతై ఆరేళ్లవు తోందని , ఒడిశా ప్రస్తుత ప్రభుత్వం చేతుల్లో జగన్నాథ ఆలయానికి రక్షణ లేదని ఆందోళన వెలిబుచ్చారు.

రత్నభండారం తాళాల గల్లంతుపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికను రాష్ట్ర బీజేడీ ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందో ఒడిశా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, ఈ కేసులో బీజేడీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం జూన్ 10న అధికారం లోకి రాగానే ఆ నివేదికను బయటపెడతామని చెప్పారు. ఈ ఆరోపణలపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. మోడీ తన ద్వేషపూరిత ప్రసంగాలతో రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య శత్రుత్వాన్ని సష్టించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రత్నభండారం తాళాలు గల్లంతు పేరుతో కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైన జగన్నాథుని అవమానించడమే కాక, తమిళనాడు ప్రజలను అవమానించడమేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు ప్రజలను దొంగలుగా చులకన చేయడం తమిళనాడును అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. తమిళుల పట్ల ఎందుకు అయిష్టత, ద్వేషం అని నిలదీశారు. మోడీ ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెబుతూ తమిళనాడులో పర్యటించినప్పుడు తమిళ భాష గురించి ప్రశంసించారని, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఓట్ల కోసం ప్రచారం సాగించేటప్పుడు తమిళులపై దుష్ప్రచారం చేశారని స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News