ఆగర్భ శత్రువు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడితో గతంలో పెట్టుకున్న పొత్తులు తాను రెండు సార్లు చేసిన ‘తప్పులే’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఆ తప్పిదాలను పునరావృతం చేయరాదని తాను తీర్మానించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో కలసి పాల్గొన్న ఒక కార్యక్రమంలో జెడి (యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆ వ్యాఖ్య చేశారు. ‘మా భాగస్వామ్యం 1990 దశకం నాటిది. బీహార్‌లో మంచి పని అంతా మా సారథ్యంలోనే జరిగింది’ అని నితీశ్ చెప్పారు. జెడి (యు) అప్పట్లో సమతా పార్టీగా ఉండేది. ఆర్‌జెడిని పేరు పెట్టి ప్రస్తావించకుండా ‘నాకు ముందు అధికారంలో ఉన్నవాం ఏమీ చేయలేదు. రెండు సందర్భాల్లో వారితో కలసి సాగడం నేను చేసిన పొరపాటే. ఆ పొరపాటును తిరిగి చేయాలనుకోవడం లేదు.
నేను ఇక్కడే (ఎన్‌డిఎతోనే) సాగుతాను’ అని సిఎం చెప్పారు. జనవరిలో ఎన్‌డిఎలో తిరిగి చేరిన బీహార్ ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి పాల్గొన ర్యాలీల్లో తాను ‘శాశ్వతంగా’ బిజెపితో కలసి ఉంటాను అని స్పష్టం చేశారు. బిజెపి పట్ల తన విధేయతను నితీశ్ తాజాగా ధ్రువీకరించడం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌తో తన ఇటీవలి సమావేశం నేపథ్యంలో చోటు చేసుకున్నది. ఆర్‌జెడితో కలసి నితీశ్ అధికారం పంచుకున్నప్పుడల్లా తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం విదితమే. కాగా, లోక్‌సభలో మెజారిటీ కోల్పోయిన బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి జెడి (యు) వంటి పార్టీల మద్దతుపై బాగా ఆధారపడుతున్నది.