పాట్నా : సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకపోయినా ఆ వేడి మాత్రం బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూఏ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాదే సాధారణ ఎన్నికలు జరగవచ్చని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ముందుగానే నిర్వహించాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని , ముందస్తుగా ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు రావడానికి అభ్యంతరం ఏమిటని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే బీహార్‌లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో , రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలే తేల్చి చెబుతారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు దేశంలో మోడీ సర్కార్‌ను గద్దె దింపేందుకు ఇప్పటికే విపక్షాలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం సాధారణ ఎన్నికలు 2024లో జరగవలసి ఉంది.