Monday, December 23, 2024

తాగేసి వచ్చారా ?.. అసెంబ్లీలో ఎమ్‌ఎల్‌ఎలపై సీఎం నితీశ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో మద్యం పై సంపూర్ణ నిషేధం ఉండగా, కల్తీ మద్యం తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చాప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాగేసి వచ్చారా ? అంటూ ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలపై విరుచుకుపడ్డారు.

బీహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్ లోనే పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఛాప్రా లోని రెండు గ్రామాల్లో ఈ కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో బుధవారం ప్రతిపక్ష బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు నిరసన చేపట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శాసన సభలో ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం నితీశ్ కుమార్ విపక్షాలపై విరుచుకు పడ్డారు. “ఏం జరుగుతోంది. అరవకండి. మద్యం సేవించి సభకు వచ్చారా ? మీరు చేస్తున్నది కరెక్టు కాదు. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు” అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు సభ నుంచి వాకౌట్ చేశారు.

కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…

నితీశ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపాయి. దీనిపై కేంద్ర మంత్రి , బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ “ పదేళ్ల క్రితం నితీశ్‌జీ ఇలా చేయలేదు. ఇప్పుడు ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతోపాటు వయసు కూడా పెరుగుతోంది. అందుకే కోపం తెచ్చుకుంటున్నారు. ” అంటూ ఎద్దేవా చేశారు.

అంతేగాక, “బీహార్‌లో మద్యం రాష్ట్రమంతటా ఉంటుంది. కానీ ఎవరూ దాన్ని చూడలేరు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. నితీశ్ కాలం ముగిసింది. ఆయన తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్టున్నారు. ఈ మధ్య తరచూ కోపం తెచ్చుకుంటున్నారు” అంటూ వ్యంగాస్త్రాలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News