Friday, November 22, 2024

అభద్రతలో నితీశ్!

- Advertisement -
- Advertisement -

CM Nitish kumar in insecurity!

 

ఎంతో తెలివిగా ఏ ఎండకాగొడుగు పడుతూ నిరంతరం అధికార అందలాల్లో ఊరేగేవారికి కూడా ఎల్లకాలం ఆనంద యోగం ఉండదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తుంటాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గత వైభవాన్ని కోల్పోయి చిత్తుగా ఓడిపోయినా సింహాసనం వరించి వరుసగా ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎంత చేదు విషాన్ని మింగుతూ ఆ పదవిలో కొనసాగుతున్నారో ఆయన అప్పుడప్పుడూ చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే అర్థమవుతుంది. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకోలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఎవరినైనా గద్దె ఎక్కించవచ్చునని, భారతీయ జనతా పార్టీ తన సొంత సిఎంను నియమించుకోవచ్చునని గత నెల 27న నితీశ్ వెలిబుచ్చిన అభిప్రాయం ఆయన ఆ పీఠం మీద ఎంత అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారో తెలియజేసింది. తన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే ఆయన ఈ మాటలన్నారు.

ముఖ్యమంత్రి పదవిలో పూర్తి కాలం తనను కొనసాగనిచ్చే అవకాశాలు లేవని ప్రకటించి ఆయన తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కుకున్నారు. గత నెలలో అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసి అలా మాట్లాడించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో గల ఏడుగురు జెడి(యు) శాసన సభ్యుల్లో ఆరుగురిని బిజెపి తనలో కలుపుకోడం ఆయనకి అప్పుడు బాధ కలిగించింది. మొన్న ఆదివారం నాడు మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ జన్మదినోత్సవ సభలో మాట్లాడుతూ ఈసారి తనకు పూర్తి కాల ముఖ్యమంత్రి పదవీ యోగం ఉండకపోవచ్చుననే భయాన్ని ఆయన వెలిబుచ్చారు. జెడి(యు)లోని అత్యంత వెనుకబడిన తరగతుల విభాగం ఏర్పాటు చేసిన సభలో నితీశ్ మాట్లాడారు. తాను సిఎం పదవి నుంచి మధ్యలోనే తప్పుకునే అవకాశాలు లేకపోలేదనడం వేరు, తనను ఆ పీఠం మీది నుంచి మధ్యలోనే దించేసే అవకాశాలున్నాయనడం వేరు.

కేవలం భారతీయ జనతా పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ముఖ్యమంత్రిగా కొనసాగవలసి వచ్చిందనే బాధ ఆయనను తరచూ పీడిస్తున్నదని చెప్పవచ్చు. అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన కర్పూరీ ఠాకూర్ సోషలిస్టు. ఆయన 1970లో మొదటి సారి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కాని ఆరు మాసాలు గడిచేసరికి ఆ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. మళ్లీ 1977లో సిఎం అయిన ఠాకూర్ రెండు సంవత్సరాల తర్వాత దిగిపోక తప్పలేదు. ఆయనతో పోల్చుకుంటూ నితీశ్ కుమార్ తనను కూడా అర్థంతరంగా పదవి నుంచి దించివేయవచ్చునని అనడం యాదృచ్ఛికం కాదు. ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితి అటువంటిది. గతంలో జెడి(యు) పెద్ద పార్టీగా, బిజెపి దానికంటే తక్కువ బలమున్నదిగా ఏర్పడిన ఎన్‌డిఎ అధికార కూటమి ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన నితీశ్ కుమార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పై చేయిని కాపాడుకోలేకపోయారు.

తాను ఆ విధంగా దెబ్బ తినడానికి బిజెపి కేంద్ర నాయకత్వం కదిపిన మోసపూరిత పావులే కారణమనే అభిప్రాయం ఆయనలోనూ ఉంది, ఆ పరిణామాలు గమనించిన వారందరూ అలాగే అనుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కీ.శే. రామ్ విలాశ్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ ఎన్‌డిఎలో కొనసాగుతూనే నితీశ్ కుమార్‌కి వ్యతిరేకంగా జెడి(యు) అభ్యర్థులను ఓడించడమే లక్షంగా ఎన్నికల్లో పోటీ చేసినా బిజెపి ఆయనను పల్లెత్తు మాట అనకపోడం నితీశ్‌ను తీవ్రంగా బాధించింది. అదంతా తనను కత్తిరించి కనిష్ఠుడుగా చేయడానికి బిజెపి చేయించినదేనని నితీశ్‌కు ఎరుకే. అంత జరిగినా పదవీ వ్యామోహంతో బిజెపి జేబులో బొమ్మగా, తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఆయన అంగీకరించారు. తనను అధికార పీఠం మీద కూచోబెట్టిన తర్వాత కూడా బిజెపి తనను అనుక్షణం అవమానపరుస్తున్నదనే బాధ ఆయనలో ఉంది. ఇదంతా నితీశ్ చేజేతులా చేసుకున్నదే.

మొదట్లో లాలూప్రసాద్ యాదవ్‌తో కలిసి నడిచి ఆ తర్వాత విడిపోయి బిజెపితో చేరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి, కేంద్రంలో మంత్రి పదవి కూడా అనుభవించి, 2014 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తీవ్రంగా ఆగ్రహించి దానికి దూరమై లాలూ ఆర్‌జెడితో చేతులు కలిపి మహాఘట్ బంధన్ గెలుపు నుంచి దక్కిన ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకొని ఆ తర్వాత మధ్యలోనే ఆ నావ నుంచి బయటికి దూకి మళ్లీ బిజెపితో చెట్టపట్టాలేసుకొని ఆ పదవిలో కొనసాగిన నితీశ్ అధికారం కోసం ఎందుకైనా వెనుకాడరనే అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత స్వచ్ఛందంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించి ఉంటే గొంతులో కొండ చిలువను భరిస్తూ అప్పుడప్పుడూ ఇలా అధికార అభద్రతా భావాన్ని వ్యక్తం చేయక తప్పని దుస్థితి కలిగి ఉండేది కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News