Monday, December 23, 2024

కమలంతో నితీశ్ కటీఫ్

- Advertisement -
- Advertisement -

నేడు జెడియు ఎంపి,
ఎంఎల్‌ఎలతో భేటీ
ఆర్‌జెడి, కాంగ్రెస్, లెఫ్ట్‌తో
కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వ
ఏర్పాటుకు సన్నాహాలు

పాట్నా/న్యూఢిల్లీ : బీహార్‌లో జెడి(యు)-బిజెపి బంధం బీటలు బారుతోంది. సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ సత్సంబంధాలు ఎట్టకేలకు తెగిపోబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళవారం(నేడు) పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలతో సిఎం నితీశ్ కుమార్ సమావేశం కానుండడం వాటికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అదే సమయంలో ప్రధానమంత్రి సమావేశాలకు నితీశ్ దూరం పాటిస్తూ వస్తున్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో కొనసాగడం ఇక ఎంతమాత్రం మంచిది కాదనే అభిప్రాయంలోకి జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ వచ్చినందు వల్లే ఆయన వైఖరికి కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ మేరకు జెడియు వర్గాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తులు దానికి సంబంధించిన సమాచారాన్ని కావాలనే లీక్ చేస్తున్నారని సమాచారం.

మరోవైపు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై సిఎం నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌జెడి, వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీశ్ కుమార్ ఆదివారం ఫోన్‌లో మాట్లాడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సోనియాను కలిసేందుకు నితీశ్ సమయం కోరినట్లు పేర్కొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బీహార్ కాంగ్రెస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత అజిత్ శర్మ నివాసంలో శాసనసభ్యులతో హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేసింది. సోషలిస్టు సిద్ధాంతాలు కలిగి ఉన్న జెడి(యు) అధినేత నితీశ్ కుమా ర్ బిజెపిని వీడితే స్వాగతిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు ఎన్‌డిఎను పారదోలాలని నితీశ్ బయటకు వస్తే ఆలింగనం చేసుకొని మరీ ఆహ్వానం పలుకుతామని ఆర్‌జెడి ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ స్పష్టం చేశారు. బిజెపిపై పోరాటానికి ఆర్‌జెడి సైతం కట్టుబడి ఉందన్న ఆయన నితీశ్ వస్తే ఆయన వెంట నడుస్తామన్నారు.

శివసేనలా మార్చబోతున్నారనే…

బీహార్‌లో జెడియు మహారాష్ట్రలో శివసేనలా మారబోతోందనే ఉద్దేశం నితీశ్ కుమార్‌లో బలంగా నాటుకుపోవడమే దానికి ప్రధాన కారణం. అందుకే ప్రభుత్వానికి ఢోకా లేకుండా తిరిగి ప్రాంతీయ పార్టీలతో జత కట్టాలనే ఆలోచనకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్‌జెడి, కాంగ్రెస్ కీలక నేతలకు పాట్నాకు రావాలనే పిలుపు ఇప్పటికే వెళ్లింది. బిజెపితో గనుక దూరం జరగకపోతే మహారాష్ట్రలో థాక్రేకు ఎదురైన అనుభవమే తనకూ ఎదురవుతుందని, అందుకు ‘వెన్నుపోటు’ అస్త్రా న్ని బిజెపి ప్రయోగించబోతోందని నితీశ్ కుమార్ భావిస్తున్నారు. ‘ప్రాంతీయ పార్టీల మనుముందు మనుగడ కష్టతరం’ అని ఇటీవల బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా చేసిన కామెంట్లతో జెడియు జాగ్రత్త పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తునారు.

చిచ్చురేపిన సింగ్ వ్యాఖ్యలు

జెడియు కీలక నేత ఆర్‌సిపి సింగ్ రాజ్యసభ పదవీకాలా న్ని కావాలనే పొడిగించకుండా నితీశ్ అడ్డుకున్నారని, ఆయన కేంద్రం చేతిలో పావుగా మారారన్న వాదన తెర మీదకు వచ్చింది. ఏడు జన్మలెత్తినా నితీశ్ ప్రధాని కాలేడంటూ ఆర్‌సిపి సింగ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే జెడియుకి గుడ్‌బై చెప్పడంతో నితీశ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, బీహార్ షిండే సింగేనని, నితీశ్ వాదన నిజమేనని జెడియులో చర్చ నడుస్తోంది. ఆర్‌సిపి సింగ్ ను పెద్దల సభకు ఎంపిక చేసింది స్వయంగా నితిశేనని, అలాంటిది ఆయనే స్వయంగా సింగ్‌ను నిలువరించడం ఇక్కడ గమనార్హం. అంతకుముందు సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు వివరణ ఇవ్వాలని పార్టీ కోరిన నేపథ్యంలో ఆయన నితీశ్ విరుచుకుపడుతూ జెడియుకు గుడ్‌బై చెప్పారు.

మరోవైపు నితీశ్ కుమార్ ప్రధాన అనుచరుడు, జెడియు ప్రెసిడెంట్ రాజీవ్‌రంజన్‌సింగ్ వ్యాఖ్య లు కూడా నితీశ్ వ్యూహానికి బలం చేకూరుస్తున్నాయి. బిజెపిలో చేరాలని సింగ్ ఎప్పటి నుంచో భావిస్తున్నారని, ఆ పార్టీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉన్నారని అన్నారు. ‘పొత్తులో భాగంగా మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఓ మంత్రి పదవికావాలని కోరాం. ఆ సమయంలో సింగ్ జోక్యం చేసుకుని.. తనకు మాత్రమే మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. అలాంటిప్పుడు నాకెందుకు చెప్పడం.. వాళ్లతో కలిసి మీకు మీరే డిసైడ్ చేస్కోండి’ అంటూ నితీశ్, ఆర్‌సిపి సింగ్ మీద ఫైర్ అయినట్లు రంజన్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు.

అమిత్ షా మాట నమ్మలేదా..?

‘2024లో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్‌డిఎ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్, లోకసభ ఎన్నికల్లోనూ జెడియుతో పొత్తు ఉంటుంది అని స్వయానా బీజేపీ కీలకనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రకటనను నితీశ్ నమ్మట్లేదన్నది ఆయన అంతరంగికులు చెబుతున్నారు. అంతేకాదు ఏక్‌నాథ్ షిండే ద్వారా శివసేనలో బీజేపీ ముసలం రేపిందని, ఆ అసంతృప్తత ద్వారా నే ఉద్దవ్‌ను గద్దె దింపిందని నితీశ్ పదే పదే పార్టీ భేటీల్లో చర్చిస్తున్నారట. బీహార్ కేబినెట్‌లోని జెడియు మంత్రుల్లో చాలామంది అమిత్ షాకు అనుకూలంగా ఉన్నారని, రిమోట్ కంట్రోల్ పూర్తిగా షా చేతికి వెళ్లకముందే జాగ్రత్త పడాలని నితీశ్ భావిస్తున్నట్లు తెలుస్తో ంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News