పాట్నా: బీహార్ సిఎం నితీశ్ కుమార్ మోర్నింగ్ వాక్ సమయంలో భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. కొందరు వ్యక్తులు నితీశ్‌కు చాలా దగ్గరగా బైక్‌పై వచ్చి ఢీకొట్టినంత పనిచేశారు. గురువారం ఉదయం ఆయన తన నివాసం నుంచి సర్కులర్ రోడ్డు వైపు మోర్నింగ్ వాక్‌కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై ఆ మార్గం లోకి వచ్చారు. పోలీస్ భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం నితీశ్ వైపు వేగంగా దూసుకొచ్చారు. వీరిని గమనించిన నితీశ్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్ పైకి దూకారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
భద్రతా సిబ్బంది బైకర్లను వెంటాడి అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ప్రదేశంలో సిసిటివి ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరపాటున జరిగిందా లేక మరేదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన తరువాత ఎస్‌ఎస్‌జి కమాండెంట్, పాట్నా ఎఎస్పీని నితీశ్ తన ఇంటికి పిలిపించి సమావేశమయ్యారు. ఈ సంఘటన జరిగిన సర్కులర్ రోడ్డులో మాజీ సిఎం రబ్రీదేవి సహా పలువురు రాజకీయ నాయకుల నివాసాలున్నాయి.