Sunday, December 22, 2024

మళ్లీ బిజెపి గూటికి నితీశ్?

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ రాజకీయ క్షేత్వంలో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి బిజెపితో కలిసిపోనున్నారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాఘట్‌బంధన్ కూటమినుంచి వైదొలగనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. లోక్‌సభతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని కలిసి కట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ‘ ఇండియా’ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. నితీశ్ కుమార్ 2013నుంచి ఎన్‌డిఎ, మహాఘట్‌బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సిఎం పదవిని చేజిక్కించుకుంటున్నారు.

మహాకూటమినుంచి వైదొలగా ఎన్‌డిఎలో చేరిన రెండేళ్లకే చివరి సారిగా 2022లో ఆయన మళ్లీ మహా కూటమిని ఏర్పాటు చేశారు. 2020లో బీహార్‌లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్,సహా స్థానిక పార్టీలతో కలిసి మహా కూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కూటమిలో విభేదాలు రాకుండా ఉండడం కోసం ఆర్‌జెడికి చెందిన తేజస్వి యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత బిజెపియేతర ప్రతిపక్షాలన్నిటినీ ఒకే తాటిపైకి తేవడంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు కూడా. అయితే ఇక్కడ కూడా తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మరోసారి రూటు మార్చడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.

అనుమానాలకు ఆజ్యం..
దివంగత సిఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని నితీశ్ ప్రభుత్వం స్వాగతించింది.అంతేకాకుండా ఠాకూర్ శతజయంతి వేడుకల కార్యక్రమంలో వంశపారంపర్య రాజకీయాలను ఎత్తిచూపుతూ నితీశ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్పూరీ ఠాకూర్ చూపిన బాటలోనే తమ ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. కొన్నిపార్టీలు తమ వారసుల రాజకీయ భవిష్యత్తుకోసం పోరాడుతాయంటూ పరోక్షంగా లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడినుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై లాలూప్రసాద్ కుమార్తె రోహిణీ ఆచార్య ఘాటుగా స్పందించారు. ‘కొందరు తమ సొంత లోపాలను చూసుకోరు.. ఇతరులపై బురద చల్లుతారు’ అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఆమె ఆ తర్వాత తొలగించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పరిణామాలన్నీ బిజెపివైపు నితీశ్ అడుగులు పడుతున్నాయన్న అనుమానాలను పెంచుతున్నాయి.

మరో 8 మంది ఎంఎల్‌ఎలు అవసరం!
మరో వైపు ఈ పరిణామాలపై లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడి కూడా అప్రమత్తమయింది. ఒక వేళ నితీశ్ మహా ఘట్‌బంధన్‌నుంచి వైదొలగినా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే దానిపై మంతనాలు సాగిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎంఎల్‌ఎల మద్దతు అవసరం. ప్రస్తుతం మహాఘట్‌బంధన్‌లోని ఆర్‌జెడికి 79 సీట్లు, జెడి(యు)కు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాకు 16 సీట్లు ఉన్నాయి.ఒక వేళ జెడి(యు) కూటమినుంచి వెళ్లిపోతే ప్రభుత్వం కొనసాగడానికి అవసరమైన 122 మందికి మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ 8 మంది సభ్యుల మద్దతును ఎలా కూడగట్టగలమనే దానిపై ఆర్‌జెడి లెక్కలు వేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మఝి పార్టీకి చెందిన నలుగురు, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్( ఎఐఎంఐఎం)కు చెందిన ఒకరు, మరో ఇండిపెండెంటు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

అయినా మరో ఇద్దరు సభ్యుల మద్దతు కావాలి. దీనిపైనే లాలూ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. మరో వైపు నితీశ్ కుమార్ బిజెపితో చేతులు కలిపే అవకాశముందన్న వార్తలు వెలువడుతుండడంతో లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాత్రి అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. మరో వైపు నితీశ్ కుమార్ తన నివాసంలో తమ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలందరితో సమావేశం కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. రాబోయే 24 గంటలు చాలా కీలకమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై బిజెపి అధిష్ఠానంతో చర్చించడం కోసం రాష్ట్ర బిజెపి నేతలు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. చిరాగ్ పాశ్వాన్ కూడా బిజెపి అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇది మొదటిసారికాదు
దేశంలోని కీలక నేతల్లో ఒకరైన నితీశ్ కుమార్ పార్టీ మారడం ఇది మొదటి సారి కాదు. ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న ఆయన 2013నుంచి ఇప్పటివరకు అయిదు సార్లు తన మిత్ర పక్షాలకు హ్యాండిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News