చెన్నై : రాష్ట్రం లోని ప్రజా ప్రతినిధులకు తమిళనాడు ముఖ్యమంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారి, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈమేరకు నామక్కల్‌లో జరిగిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. “ నేనే ప్రజాస్వామిక వాదిగా మారినట్టు నా సన్నిహితులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎదుటివారి అభిప్రాయాలు వినడం… వాటిని గౌరవించడం. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదు. అలా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎవరైనా క్రమశిక్షణారాహిత్యంగా మెదులుతూ అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించను. నేనే నియంతగా మారి, కఠిన చర్యలు తీసుకుంటా. ఈ విషయం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకే చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను” అని స్టాలిన్ హెచ్చరించారు. అలాగే కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను, భర్తలకు అప్పగించరాదని, ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులు … చట్టానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.