వయనాడ్‌లో కొండచరియల విపత్తుకు కొన్ని రోజుల ముందే హెచ్చరించామని కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు కేంద్రం నుంచి ఎలాంటి అలర్ట్‌ను జారీ చేయలేదని స్పష్టం చేశారు. “అధికారులు హెచ్చరికలు జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగి పడ్డాయి. పరస్పరం నిందించుకోడానికి ఇది సమయం కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోడానికి సహకరించండి.” అని సిఎం విజ్ఞప్తి చేశారు. విపత్తు గురించి జులై 23నే తెలియజేసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం తరలించలేక పోయిందని ,
అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదని అమిత్‌షా చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇప్పటివరకు 144 మృతదేహాలు వెలికి తీశారని, 191 మంది ఆచూకీ తెలియలేదని , మొత్తం 5500 మందిని రక్షించగలిగామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 8 వేల మందికి పైగా బాధితులను 82 శిబిరాలకు తరలించినట్టు పేర్కొన్నారు. వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.