Sunday, December 22, 2024

నౌకాదళం.. తెలం’గానం’

- Advertisement -
- Advertisement -

కీలక స్థావరంగా రాష్ట్రం ఎంపిక, వికారాబాద్ జిల్లా దామగూడం ఫారెస్ట్‌లో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు,
హిందూ మహా సముద్రంలో తిరిగే నౌకాదళం నౌకలు,
జలాంతర్గాములకు ఇక్కడి నుంచే సిగ్నల్స్, 1,174 హెక్టార్ల అటవీ భూముల బదిలీకి ఒప్పందం,
సిఎం రేవంత్‌తో ఇండియన్ నేవీ అధికారుల చర్చలు

గవర్నర్ తమిళిసైని కలిసిన సిఎం రేవంత్, డివ్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనుంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్‌ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏ ర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్‌ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది.

1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేష న్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన  ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డిఈఓ రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డిఎఫ్ ఓ, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది.

ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త విఎల్‌ఎఫ్ సెంటర్ పూర్తికానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News