Sunday, December 22, 2024

గతి తప్పిన పాలనను గాడిన పెడుతున్నాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి తాను ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాదని, పని చేసే ముఖ్యమంత్రిని అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వారిని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలు, నిబద్ధతను ప్రతి ఒక్కరూ పాటించాలని సిఎం ఈ సందర్భంగా సూచించారు. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను సిఎం ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలన వేడుకలను నిర్వహించగా పలు జిల్లాలో పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ జిల్లాలో పాల్గొన్నారు.

పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగింది
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని ఆయన మండిపడ్డారు. గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందని, కానీ, ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని సిఎం రేవంత్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ స్వరూపం బిగించిన పిడికిలి మాదిరి ఉంటుందని, పిడికిలి పోరాటానికి స్వరూపమని సిఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో ఐదువేళ్ల లాంటి కులాలు, జాతులు, మతాలు కలిసి ఉంటాయన్న సందేశం ఈ గుర్తు మనందరికీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

‘బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు’
బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదని, ఐక్యంగా, సమైక్యంగా ఉండే తెలంగాణకు ఆ పిడికిలికి ఉన్నంత శక్తి ఉందని సిఎం రేవంత్ అన్నారు. ఇది 4 కోట్ల ప్రజల పిడికిలి అని, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని, పెత్తందార్లపై, నియంతలపై పోరాటానికి ఇది సంకేతంగా ఉండాలని ఆయన సూచించారు. 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని, ఆ బానిస సంకెళ్లను తెంచడానికి స్ఫూర్తి ఈ సెప్టెంబర్ 17వ తేదీ అని ఆయన అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజలకు చెప్పామని ఆయన తెలిపారు. గజ్వేల్ గడ్డపై 2021, సెప్టెంబర్ 17వ తేదీన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించామని సిఎం రేవంత్ తెలిపారు. 2022, డిసెంబర్ 3వ తేదీన తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించాం. తమకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమేనని, తమ ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమేనని, అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలనా దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అక్షర యోధులు ఒకవైపు, సాయుధ యోధులు మరోవైపు…
తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా అక్షర యోధులు ఒకవైపు, సాయుధ యోధులు మరోవైపు పోరాడి నిరంకుశ రాచరికాన్ని, హైదరాబాద్ రాజును ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ పోరాటం ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ అంటే త్యాగమని, నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, నిస్వార్థంగా తమ జీవితాలను ఫణంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వేయని ఆ మహానీయుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని సిఎం వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణలో అత్యంత కీలకమైన రోజని, అయితే దీనిపై అనేకమంది భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నారని, కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంభోదిస్తున్నారని, కానీ, ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయిందని ఆయన వెల్లడించారు. నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజని, ఇది ప్రజల విజయమని, అలాంటిది ఇందులో రాజకీయాలకు తావు ఉండకూడదని ఆయన అన్నారు.

రూ.18 వేల కోట్లు…. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో….
మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని సిఎం రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో సుమారు రూ.18 వేల కోట్లను 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశామన్నారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ సమస్యను అధిగమించి ప్రతి ఒక్క అర్హుడిని రుణ విముక్తులను చేస్తామన్నారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, భేషజాలకు పోకుండా స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణల వ్యూహాత్మక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్ బ్రాండ్‌గా చేస్తున్నట్లు సిఎం రేవంత్ వివరించారు. మూసీ సుందరీకరణ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని, వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు సిఎం తెలిపారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు
పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూ మాఫియా ప్రయత్నిస్తోందని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమేనని సిఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్ భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్లం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సిఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల కేరళ వంటి ప్రకృతి విలయ తాండవం హైదరాబాద్‌కు రావద్దన్నారు. హైడ్రా వెనుక రాజకీయ కోణం, స్వార్ధం లేదన్నారు. అదో పవిత్రమైన కార్యమని, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞమని ఆయన అభివర్ణించారు. భూ మాఫియా పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలని సిఎం రేవంత్ కోరారు. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కచ్చితంగా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రాను కొనసాగిస్తామన్నారు. కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News