Thursday, January 9, 2025

తెలుగు సినిమాకు గద్దర్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

గత జనవరి 31 నాడు ప్రజాగాయకుడు గద్దర్ 75వ జయంతోత్సవాల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత గద్దర్ పేరిట తెలుగు సినిమాలకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. తెలుగు సినిమాలకు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఉంటాయని అన్నారు. జనవరి 2025 నుండి వీటి ప్రదానం మొదలవుతుందని కూడా చెప్పారు. ఆ సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ విషయంలో కొంత చర్చ అవసరం. నిజానికి ముఖ్యమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే సినీవర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం తెలంగాణ సినీ జీవులు కూడా స్వాగతించినట్లు లేదు. ఒక సినీకవి మాత్రం ఈ నిర్ణయాన్ని శ్లాఘిస్తూ రేవంత్ రెడ్డిని ‘రెవల్యూషన్’ రెడ్డిగా అభివర్ణించారు.

కొంతకాలం వేచి చూసిన రేవంత్ రెడ్డి తాను అవార్డులు ఇస్తానంటే సినిమా వాళ్ల నుండి ఎలాంటి ఉలుకు పలుకు లేదని గత ఆగస్టులో ఓ సందర్భంలో అన్నారు. దాంతో ఇక తప్పదన్నట్లు ఒక హీరో గద్దర్ సినిమా అవార్డులను స్వాగతిస్తున్నట్లు ప్రకటించాడు. అదే నెలలో ప్రభుత్వం బి నర్సింగరావు చైర్మన్‌గా అవార్డుల కమిటీని నియమించింది. అక్టోబర్‌లో ఆ కమిటీ సభ్యులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. దాని వివరాలేమీ తెలియరాలేదు. తెలుగు సినిమాలకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇచ్చేవారు. ఏ కారణంగానో అవి 2011 నుంచి ఆగిపోయాయి. నంది అవార్డు స్థానంలో సింహ అవార్డులు ఇస్తామని 2016లో తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించింది. 2017 ఉగాది నుండి ప్రారంభిస్తామని అన్నారు. ఆనాటి ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడి దాని సిఫారసులను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారని వార్తలు కూడా వచ్చాయి. అవి ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు కూడా వెళ్లాయని తెలుస్తోంది.

అయితే ఎందుకోగానీ అవి కార్యరూపం దాల్చలేదు. తెలుగులో వస్తున్న సినిమాల్లో ఆంధ్ర ప్రాంతంవారే ఎక్కువగా ఉన్నందున ఆ అవార్డుల విషయంలో తెలంగాణ ప్రజల నుండి వ్యతిరేకత రావచ్చునేమోనని ఆంతరంగికుల సూచన మేరకు కెసిఆర్ ఈ విషయంలో ముందుకు వెళ్లకపోవచ్చు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు చెందిన కొందరు సినీజీవులు ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిసి ప్రత్యేకంగా తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించాలని ప్రయత్నించారు. కాని అది సాధ్యపడలేదు. 2014 ఆగస్టులో కెసిఆర్ హైదరాబాద్ శివారులోని రాచకొండ ప్రాంతం తిరిగి వచ్చి అక్కడ రెండు వేల ఎకరాల్లో ప్రభుత్వం తరఫున ఫిల్మ్ సిటీ నిర్మిద్దాం.. అంచనా వ్యయాలు సిద్ధం చేయమని అధికారులకు చెప్పారు. అదేమైందో కూడా తెలియరాలేదు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో సినిమా అవార్డుల ప్రస్తావన మళ్ళీ తేలేదు. అటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమావాళ్లకు అవార్డులు ఇవ్వాలని గత పదేళ్లుగా ఆలోచించలేదు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి కూడా వాటి పట్ల ఆసక్తి ఉన్నట్లుగా లేదు.

ఎపి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సినిమా హీరో పవన్ కళ్యాణ్ బుర్రలో ఈ విషయంలో ఏముందో తెలియాలి. ఆగస్టు 2023లో మరణించిన గద్దర్ పేరు నిలిచేలా ఏదైనా చేయాలని రేవంత్ ప్రభుత్వం తలచింది. కెసిఆర్ పట్టించుకోనివారిని చేరదీసి వారికి ఇచ్చే గౌరవాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆలోచన రేవంత్‌కు మొదటి నుంచి ఉంది. గద్దర్‌ను కెసిఆర్ ప్రగతిభవన్ ముందు మూడు గంటలు వేచి ఉండేలా చేసి చివరకు కలిసే అవకాశం ఈయలేదని తెలుస్తోంది. ఆ కోపంతోనే ఆయన కుటుంబం కాంగ్రెస్‌కు దగ్గరైంది అనవచ్చు. కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన గద్దర్ కుమార్తె వెన్నెలకు ఇటీవల సాంస్కృతిక సారథి పదవిని రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఇదంతా రాజకీయంలో భాగమైనా గద్దర్‌కు మాత్రం ప్రభుత్వం తరపున ఓ ప్రత్యేక గుర్తింపు దక్కవలసిందే. మంచి సినిమాలకు అవార్డుల ప్రోత్సాహమూ అవసరమే. అసలు సమస్య ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తుంది అనేదే. ఈ నేల అస్తిత్వాన్ని ప్రతిబింబించే సినిమాలు ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు తెలుగులో నగర నేపథ్యంతో పాటు, ఆంధ్ర గ్రామీణ, తెలంగాణ జీవనవిధాన ప్రధానంగా సినిమాలు వస్తున్నాయి. వీటిలో తెలంగాణ సినిమాలు లెక్కలో చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ వారు సినిమాకు చెందిన అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నారు. వీటిలో తక్కువ బడ్జెట్ సినిమాలే ఎక్కువ. భారీ సినిమాలను తెలంగాణ నిర్మాతలు కూడా ఆంధ్ర నేపథ్యం ఉన్న పెద్ద నటీనటులతోనే నిర్మిస్తున్నారు.

ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రత్యేక సినిమాలు పెద్ద సినిమాలతో అవార్డుల పోటీలో నిలబడగలవా? నాణ్యత ప్రమాణాల దృష్ట్యా తెలంగాణ సినిమాలకు అవార్డులు దక్కకపోతే ప్రభుత్వ ఆలోచనకు పరమార్ధమేమిటి? అందుకోసం ప్రభుత్వం తెలంగాణ సినిమాలకు కొన్ని ప్రత్యేక అవార్డులను ఇవ్వాలి. కొత్తగా సినిమా రంగంలోకి వస్తున్న తెలంగాణ యువతను ప్రోత్సహించాలి. ఇది అత్యవసరం. ఉత్తమ తెలుగు సినిమాతో పాటు ఉత్తమ తెలంగాణ సినిమాని కూడా ఎంపిక చేసి రెండింటికీ సమాన గౌరవం ఇవ్వాలి. ఇదే రకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అవార్డులను కూడా తెలంగాణ నేపథ్య సినిమాలకు విడిగా ఇవ్వాలి. ఇటీవల నిర్మాత దిల్‌రాజును తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి, అవార్డుల విషయంలోనూ ఆయన సూచనలు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఈ నెలాఖరులో గద్దర్ సినిమా అవార్డులు ప్రకటిస్తే అవి తెలంగాణ సినీ వర్గాలను, ప్రజలను నిరాశ పరచవద్దు.

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News