Monday, December 23, 2024

ముఖ్యమంత్రిపై ముప్పేట దాడి తప్పదా?

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచినా దేశం దృష్టి హైదరాబాద్ మీద నుండి మళ్లడం లేదు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేయడానికి, కనీసం తెలంగాణకు మాత్రమే కాకుండా చేయడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో రెండు తెలుగు రాష్ట్రాలకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా (చండీగఢ్ తరహాలో) ఉంటుందనే ప్రచారం మొదలుపెట్టారు. ఆ తరువాత లేదు, లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలన్నారు. మరికొద్దిమంది హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే బాగుంటుదన్నారు. ఆ ప్రయత్నాలన్నీ ప్రజాగ్రహానికి వెరచి వెనక్కు పోయాయి. అంత ముఖ్యమైయిన నగరం హైదరాబాద్. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో మాట్లాడుతూ ‘నా పోటీ ఇరుగు పొరుగు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతోనే’ అని సగర్వంగా ప్రకటించడానికి కారణం హైదరాబాద్ తన దగ్గర ఉండటమే.

హైదరాబాద్ వంటి మహా నగరం రాజధానిగా కలిగి ఉన్న ముఖ్యమంత్రికి ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అదే వరుసలో ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ను ఆనుకుని నాలుగో నగరం నిర్మించబోతున్నామని అది రాష్ట్రానికి భవిష్యత్ నగరంగా నిలుస్తుందని చెప్పారు. గతంలో కూడా కొత్త నగరాన్ని నిర్మించానని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఒకరున్నారు. మాదాపూర్ ప్రాంతంలో సైబర్ టవర్స్ పేరిట ఒక భవనాన్ని నిర్మించి అదే నగరం అని చెప్పుకున్నారు. అదే నాయకుడు ఇంకొంత దూరంపోయి అసలు హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించాను అనేంత సాహసానికి ఒడిగట్టడం చూశాం. అయితే ఆ ముఖ్యమంత్రి గతంలో చేయని పని, చేసి ఉండాల్సిన పని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నందుకు ఆయనను అభినందించాలి. దాని గురించి మాట్లాడుకోవాలి.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఆ తరువాత సైబరాబాద్‌ను కలుపుకుని మూడు నగరాలు అన్నారు. మూడు నగరాలున్నాయని మురిసిపోయిన పాలకులు అసలు నగరాన్ని నరక కూపంగా, మురికికూపంగా మార్చారన్న విషయం ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అడిగితే చెప్తారు. నగరాల సంఖ్య పెరిగి, వలసలు పెరిగిపోయి అడుపుతప్పిన జనాభా విస్ఫోటనం చూస్తున్నాం. ఈ జనాభా కోసం వెనకటికి తవ్విన చెరువులు, కుంటలు మాయమై, వాటి స్థానంలో జనావాసాలు వెలిశాయి. నీటి సరఫరా కోసం వేల కోట్లు ఖర్చు చేసి కృష్ణ, గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించుకోవాల్సిన పరిస్థితి. దాన్ని కూడా ఘనకార్యంగా చెప్పుకున్న రాజకీయ నాయకత్వం. రెండు దశాబ్దాల కాలంలో హైదరాబాద్‌లో మూడు వేల చెరువులు, కుంటలు మాయమై, వాటి స్థానంలో గృహ సముదాయాలు, వ్యాపార కేంద్రాలు, బడాబాబుల విలాసాల కోసం ఫామ్ హౌస్‌లు వెలిసిన విషయం అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వెయ్యి కాళ్ళ జెర్రిలా విస్తరించి మూడు వేల చెరువులు కాస్తా 185కు కుదించుకుపోయిన విషయం పర్యావరణవేత్తల అధ్యయనాల్లో బయటపడ్డ విషయం తెలిసిందే.

హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాల కోసం నవాబుల కాలంలో తవ్వించిన అనేక చెరువులు, కుంటలు మాయమయ్యాయి. మనం రోజూ చూస్తున్న టాంక్ బండ్‌గా పిలుచుకునే హుస్సేన్ సాగర్ ప్రజల మంచినీటి అవసరాల కోసం తవ్వించినదే. పారిశ్రామిక వ్యర్థాలు వదలడంతోబాటు చాలా భాగం కబ్జా కావడం వల్ల ఇవాళ ఒక పనికిరాని మురికిగుంటగా మారిన దుస్థితి. మాసబ్ ట్యాంక్ అని మనం పిల్చుకునే స్థలం పేరు మా సాహిబా. అంటే తల్లిగారు అని అర్థ్ధం. ఉర్దూలో తల్లిని గౌరవంగా సాహిబా అని సంబోధిస్తారు.
తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన నీటి వనరు. అది ఏమయిపోయింది? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండూ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన చెరువులే. ఇవాళ వాటి పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. ఇలా చాలా ప్రదేశాల పేర్లు హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, బావులను తలపిస్తాయి. అవి మాత్రం ఎక్కడా కనిపించవు. కాంక్రీట్ జంగిల్ దర్శనం ఇస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రకటించింది. మిషన్ కాకతీయ పేరిట రాష్ట్రమంతటా చెరువుల మరమ్మతు చేసి వాటిని పునరుద్ధరించే కార్యక్రమం. అందరూ మెచ్చుకున్న కార్యక్రమం అది. కొంతవరకు ఆ పని సజావుగానే సాగినా అందులో కూడా భారీ అవినీతి జరిగిందన్న విమర్శలు వచ్చాయి. అవినీతి ఏ స్థాయిలో అన్న చర్చ ఇక్కడ అవసరం లేదు. అయితే ఆ కార్యక్రమంలో కూడా హైదరాబాద్‌లో చెరువులు, కుంటలను పునరుద్ధరించే ప్రయత్నం జరగలేదు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 60 వేలకు మించి చెరువులు ఒకప్పుడు ఉండేవని ఒక అధ్యయనంలో తేలిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ అభినందించాల్సిన కార్యక్రమం ఒకటి ప్రారంభించారు. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఏదన్నా మంచి పని తలపెట్టినప్పుడు కొన్నిసార్లు తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. ఆ పని వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించే వర్గంనుండి అటువంటి ప్రతిఘటన తప్పదు. అదీ పలుకుబడి కలిగిన వర్గం అయితే ఆ పనిని అర్థంతరంగా నిలిపివేసిన ఉదంతాలూ, కొన్ని సందర్భాలలో ఆ ముఖ్యమంత్రుల పదవికి ఎసరు తెచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ఈ కార్యక్రమం కారణంగా ఒక్క వర్గం నుండి కాదు, పలు వర్గాల నుండి ఆయన మీద దాడి తప్పదు. అధికార యంత్రాంగం, రాజకీయ వర్గం, రియల్ ఎస్టేట్ వ్యాపారులూ ఇలా ముప్పేట దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధపడి ఉండాలి. ఆయన మానస పుత్రిక అయిన హైడ్రా ప్రారంభమై ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు. అప్పుడే స్వపక్షం నుండి, ప్రతిపక్షం నుండి ఎదురుదాడి మొదలయింది. హైడ్రా బాధ్యుడిగా నియమితుడైన అధికారి ఎ.వి.రంగనాథ్ మీద అధికారపక్షంలో ఇటీవలే చేరిన ఒక శాసనసభ్యుడు వేసిన వీరంగం చూస్తూనే ఉన్నాం. అటు బిజెపి, ఎంఐఎం వంటి ప్రతిపక్ష పార్టీల నుండి కూడా ఈ కార్యక్రమం పట్ల నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. రంగనాథ్ గట్టి అధికారి అన్న పేరుంది కాబట్టి ఈ తాటాకు చప్పుళ్లకు బెదరకపోవచ్చు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన హైడ్రాకు ఆయనే ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున ఇది మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా ఈ కార్యక్రమం వివరాలు తెలుసుకునేందుకు పర్యావరణవేత్తలూ, అధికారులూ ఆసక్తి చూపుతున్నారు. హైడ్రా బాధ్యత గురించి చెప్పుకుంటే విపత్తులు సంభవించినప్పుడు వెంటనే స్పందించడం, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం కావడం మనందరికీ అనుభవమే. చెరువులలో, కుంటల్లో నిర్మాణాలు రావడం, వాటిల్లో పారిశ్రామిక వ్యర్థాలు గుమ్మరించడం, పార్కుల కోసం నిర్దేశించిన స్థలాలు కబ్జాలకు గురికావడం సర్వసాధారణం అయిపోయిన వేళ వాటి వెనక పలుకుబడి గల వ్యక్తులూ, శక్తులూ ఉన్న వేళ హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ కార్యక్రమం సాహసమనే చెప్పాలి.

హైడ్రా ప్రస్తుతం చేస్తున్న పని అక్రమ నిర్మాణాల కూల్చివేత. అక్కడితో వారి పని అయిపోయినట్టేనా? శిథిలాలను అలా వదిలేస్తే ఏం ప్రయోజనం సాధించినట్టు? ప్రస్తుతమైతే, హైడ్రాకు ఇంతకు మించిన అధికారాలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక సమగ్ర చట్టం తీసుకు రావాలి. అందులో చెరువులను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చడంతోబాటు ఆ శిథిలాలను అక్కడి నుండి తరలించి మళ్ళీ కబ్జాలకు గురికాకుండా కంచెలు వేసి వాటి పునరుద్ధరణకు కూడా వీలు కల్పించాలి. వీటన్నిటికీ అవకాశం కల్పిస్తూ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించకపోతే ఇప్పుడు చేస్తున్న మంచి ప్రయత్నం వృథా అయిపోతుంది. కొత్త నగరాల నిర్మాణంతోపాటు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అసలు నగరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార యంత్రాంగం, రాజకీయ వర్గం, కబ్జాదారులు ఈ మూడు వర్గాల నుండి ఎదురయ్యే వత్తిళ్ళను, దాడులను తట్టుకుని నాలుగో నగర నిర్మాణంతో బాటు ఇప్పటికే ఉన్న మూడు నగరాలకు పునర్వైభవం కల్పిస్తారని ఆశిద్దాం.

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News