మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య శాఖలో నూతనంగా నియమితులైన అధ్యాపకులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయనునున్నారు. రవీంద్రభారతిలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యకు 1,292 (పురుషులు- 794, మహిళలు – 498) జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు 240 (పురుషులు 177, మహిళలు 63) నియామక ఉత్తర్వులను అందుకోనున్నారు.
ఇది రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తీసుకుంటున్న ఒక ముఖ్యమైన చర్య అని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా నియమితులైన అధ్యాపకులకు విద్యాశాఖ విధానాలు, బోధన విధానాలపై ఓరియెంటేషన్, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తరువాత వారిని రాష్ట్రంలో వివిధ జోన్లలోని కాలేజీలకు నియమించనున్నట్లు చెప్పారు. తద్వారా బోధనా సిబ్బంది కొరతను తగ్గించి, విద్యార్థుల అధ్యాపకుల మధ్య నిష్పత్తిని మెరుగుపరుస్తామని తెలిపారు.