Sunday, April 27, 2025

విద్య, వైద్యం, ఉపాధికి తొలి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మహిళలు, రైతులు, యువతే మా ప్రధాన భాగస్వాములు పదేళ్ల
బిఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు దేశంలోనే అతిపెద్ద
సంక్షేమ పథకాలను ప్రారంభించాం రైతు రుణమాఫీకి 20,617 కోట్లు
కేటాయించాం మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ అజెండా
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ భారత్ సమ్మిట్2025లో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్-2025లో సిఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు బిఆర్‌ఎస్ కాలయాపన చేసింది కాబట్టే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారన్నారు. సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్షమని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ కర్తవ్యమని ఆయన తెలిపారు. భారతదేశం చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తాము ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాపయోగ విధానాలను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్‌నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారించారన్నారు. అనంతరం ఇందిరాగాంధీ రోటీ, కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారన్నారు. ఆ తరువాత వచ్చిన ముగ్గురు ప్రధానులు రాజీవ్‌గాంధీ, పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సిం గ్‌లు ఆధునికీకరణ, అభివృద్ధి, టెలికాం, సాఫ్ట్‌వేర్ రంగాలతో పాటు ప్రపంచ సాంకేతిక విప్లవాలపై దృష్టి సారించారని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి మహిళలు, రైతులు, యువతే ప్రధాన భాగస్వాములని ఆయన తెలిపారు.

రైతు రుణమాఫీకి రూ.20,617 కోట్లు
కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని ఆయన తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే రూ.20,617 వేల కోట్లతో 25 లక్షల 50 వేల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయమని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రైతులను అప్పుల నుంచి విముక్తి చేశామన్నారు. బారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అని ఆయన తెలిపారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12,000లు ఇస్తున్నామని, ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నామన్నారు. దీంతోపాటు భూమిలేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తున్నామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి తోడు రూ.500ల బోనస్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నరలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నట్లు సిఎం రేవంత్ తెలిపారు. 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలో విషయంలో తాము పారదర్శకంగా, క్రియాశీలకంగా ఉన్నామని తెలిపారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ అజెండా
మహిళా పారిశ్రామికవేత్తలను బడా పారిశ్రామికవేత్తలుగా చేయాలన్నదే తమ ఆలోచన అని ఆయన అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అజెండాగా పెట్టుకున్నట్లు సిఎం రేవంత్ వెల్లడించారు. మహిళా గ్రూపులను బలోపేతం చేస్తున్నామన్నారు. ఆర్టీసిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, దీనికోసం రూ.5వేల కోట్లను ఖర్చు చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించామని, దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, దేశానికే రోల్ మోడల్‌గా నిలిచే కులగణన చేపట్టామని, తాము ఇటీవలే ఎస్సీ వర్గీకరణ చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మొదటి ఏడాదిలో రూ.22 వేల కోట్ల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని ఆయన తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం కోసం రూ.10 లక్షలు చెల్లిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్య వింటున్నామని, దీని కోసం ప్రజావాణిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. థర్డ్ జెండర్‌కు పోలీస్ శాఖలో రిక్రూట్ చేసుకున్నామని, తలసరి ఆదాయంలో తాము నెంబర్‌వన్‌లో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఇంకా చేయాల్సింది చాలా ఉంది
తాము ఇప్పుడే పనిమొదలు పెట్టామని ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు తాము చేపట్టిన మిషన్‌లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోవాలని ఆయన సూచించారు. మీరే తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారి తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు ఎంతో చరిత్ర ఉంది
ఈ సమ్మిట్‌లో మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు ఎంతో చరిత్ర ఉందని, దీంతోపాటు సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి ఎన్నో దశాబ్ధాల పాటు కార్మికులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు పోరాడారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజలు నిరాశలోనే ఉన్నారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News