పాత బస్తీ అభివృద్దికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో పట్టుదల ఉన్న నాయకుడని ఐదు ఏళ్లు పాటు ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శుక్రవారం పాతబస్తీ మెట్రో ఫేజ్ 2 పనులు సిఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్‌తో కలిసి పనిచేస్తామని ప్రజలు సామరస్యంగా కలిసిమెలిసి ఉన్నారన్నారు. ఈ సహృద్బావ వాతావరణాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, తెలంగాణలో కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని వాటిని ప్రజలు అడ్డుకోవాలని సూచించారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు అడగానే రూ.120 కోట్లు మంజూరు చేసినందుకు సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు ఎంఐఎం సహకరిస్తుందని, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరారు. చంచల్ గూడ జైలును హైదరాబాద్ బయటకి తరలించి ప్రస్తుతం ఉన్న భవనంలో కేజీ టూ పీజీ విద్యాబోధన జరిగేలా చూడాలని కోరారు.