Tuesday, July 9, 2024

నేడు ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ.. 10 అంశాలపై చర్చ

- Advertisement -
- Advertisement -

విభజన అంశాలతో పాటు విద్యుత్ సంస్థలపై చర్చ
10 అంశాలపై చర్చించాలని ఎజెండాతో ముందుకు
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి నేడు (శనివారం) ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే 10 అంశాల అజెండాగా వారు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులతో పాటు ఎపి నుంచి ముగ్గురు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బిసి జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌లతో పాటు తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వీరితో పాటు ఎపి సిఎస్, తెలంగాణ సిఎస్‌లతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

ఈ సిఎంల భేటీకి సంబంధించి ప్రగతిభవన్‌లో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ భేటీ కావటం ఇదే తొలిసారి. మార్చి నెలలో సిఎం చొరవతో ఢిల్లీలో ఎపి భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామన్న ప్రతిపాదనను ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ముందుంచారు. దానికి అంగీకరించిన తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్ వేదికగా భేటీకి నేడు మూహుర్తం ఖరారు చేశారు.

నీటి వాటాల జోలికి వెళ్లని ఇరు రాష్ట్రాలు…
ఈ సమావేశంలో భాగంగా 10 అంశాల గురించి ఇరు రాష్ట్రాల సిఎంల భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ఈ 10 అంశాల్లో భాగంగా 9,10 షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన, విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల విభజన, ఎపిఎస్‌ఎఫ్‌సి, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, హైదరాబాద్‌లోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ కీలక భేటీలో నీటి వాటాల జోలికి వెళ్లవద్దని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించినట్టుగా సమాచారం.

రూ.24 వేల కోట్లు ఎపి ప్రభుత్వం నుంచి…..
ఈ సందర్భంగా ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన అంశాలతో పాటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశమున్నట్టుగా తెలిసింది. దాదాపు రూ.24 వేల కోట్లు ఎపి ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ, రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఎపి పేర్కొంటుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవని ఇరు రాష్ట్రాలు పేర్కొనగా మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి.

ఎపి పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ రూ. 354 కోట్లకు పైగా రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి తమకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను ఎపికి బదిలీ చేయాలని తెలంగాణ వాదిస్తోంది. సింగరేణి సంస్థ పూర్తిగా తెలంగాణదేనని, అనుబంధం కంపెనీ అఫ్మెల్‌ను తమకే కేటాయించాలని తెలంగాణ కోరుతుంది. ఎపి మాత్రం సింగరేణి సహా అఫ్మెల్‌ను విభజన చేయాలని సూచిస్తోంది.

గతంలో 30 సమావేశాలు జరిగినా….
రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం గతంలో పలుసార్లు అధికారికంగా చర్చలు జరిపినప్పటికి పురోగతి లేకపోవడంతో ఈ దఫా చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భేటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసిపోయిన నేపథ్యంలో విభజన సమస్యలపై జరుగనున్న చర్చలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో జరిగిన సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశాల పాటు రెండు రెండు రాష్ట్రాల మధ్య 30 సమావేశాలు జరిగిన విభజన వివాదాలు పదేళ్ల నుంచి పరిష్కారం కాలేదు. తరుచూ ఆస్తుల పంపకం, అప్పుల చెల్లింపు, జల వివాదాలపై రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు కసరత్తుతో సిద్ధమయ్యాయి. తెలంగాణ నుంచి ఎపికి రావాల్సిన బకాయిలు, ఆస్తులు ఏమున్నాయన్న కోణంలో ఎపి ప్రభుత్వం సమాచారం సేకరణతో సిద్ధమైంది. ముందుగా పరిష్కారానికి వీలున్న సమస్యలపై నేటి భేటీలో రెండు రాష్ట్రాల సిఎంలు నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

దిల్ భూముల కోసం పేచీ
ముఖ్యంగా దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు హైదరాబాద్ సహా జిల్లాలో ఉన్న 238ఎకరాల భూములను కమిషన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, 2015లో ఎపి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. దిల్ ఆస్తుల విభజన చేయాలని నిపుణల కమిటీ సిఫారసులను తెలంగాణ వ్యతిరేకిస్తుంది. విభజన చట్టంలో పొందుపరుచని 12సంస్థల విభజనకు ఎపి పట్టుబడుతుండగా తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఆర్టీసి ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన మరో సమస్యగా ఉంది. అలాగే ట్రాన్స్‌కో, ఉన్నత విద్యా మండలి, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎపి హౌసింగ్ బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎపికి రావాల్సి ఉంది. ఎపి ఫైనాన్స్ కమిషన్ విభజన కూడా మరో చిక్కుముడిగా తయారైంది.

ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చేనా…
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలలో ఉద్యోగుల విభజన అంశం మరో కీలకాంశంగా ఉంది. ఇప్పటికే కొంత మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ ఇక్కడి వారు అక్కడ పని చేస్తున్నారు. ఎపికి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పని చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై క్లారిటీకి రావాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎపి నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల కోరుతున్నారు. ప్రస్తుతం ఎపిలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్‌ఓడిలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News