కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సిఎం రేవంత్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రేవంత్ చెప్పింది చేస్తాడు.. అనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఏడాదిన్నర పథకాల ప్లానింగ్‌కే సరిపోయింది. ఇకపై పథకాల గ్రౌండింగ్‌పై ఫోకస్ పెడతా. కేసీఆర్ మాదిరి.. లాంచింగ్.. క్లోజింగ్ పథకాలు నేను చేయను. ఓ పథకం ప్రారంభిస్తే.. అర్హులకు అందే వరకు పనిచేస్తా” అని చెప్పారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో తిరగమని చెబితే.. హైదరాబాద్‌లో తిరుగుతున్నారని గరమయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదని అన్నారు. సీఎల్పీ సమావేశంలో అందర్ని అప్రమత్తం చేస్తున్నామని.. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు.