Saturday, November 23, 2024

కొందరు ఎంఎల్ఎల సభ్యత్యం రద్దయ్యే అవకాశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని, గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కొన్ని సంప్రదాయాలు సెలకొల్పారని, తనను ఏరోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని ఆయన అన్నారు. అక్కల మాటలు నమ్మి తాను మోసపోయానని కెటిఆర్‌కు చెప్పానని, సభలో తాను వాళ్ల పేర్లు కూడా ప్రస్తావించలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో సిఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ మోసం అనే పదానికి పర్యాయపదం సబిత అని భట్టి చెప్పారని, సునీతక్క కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతే తన మీద రెండు కేసులు పెట్టారని, కౌడిపల్లి,

నర్సాపూర్‌లో ఇప్పటికీ కేసులున్నాయని ఆయన అన్నారు. అక్క అధికార పార్టీలోకి వెళితే వాళ్ల కోసం ప్రచారం చేసిన తమ్ముడి మీద కేసులు తియ్యాలా వద్దా..? మహిళా కమీషన్ పోస్టు తీసుకొని తర్వాత ఎమ్మెల్యే అయిపోతే సరిపోతుందా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. తనను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబిత అక్క నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారిందని, నా ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పిన అక్క తాను నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ లేదని, తాను ఒక్కమాట కూడా అసభ్యంగా మాట్లాడలేదని సిఎం రేవంత్ అన్నారు.

కెసిఆర్, హరీష్‌రావు ఎటు పోయారు..?
సబితక్కకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాం. అక్క వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, తర్వాత నేను మిగతాది పూర్తి చేశానని సిఎం రేవంత్ తెలిపారు. సబితక్కకు అవమానం జరిగితే, అన్యాయం జరిగితే, సబితక్క ఇంత అవేదన చెందితే కెసిఆర్, హరీష్‌రావు ఎటు పోయారు, అసెంబ్లీకి ఎందుకు డుమ్మాకొట్టారు, సభలోకి వచ్చి సబితక్కకు అండగా నిలబడాలి కదా, తమ పార్టీ సభ్యులను పట్టించుకోకుండా కెసిఆర్ ఎందుకు పత్తా లేకుండా పోయారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు కెటిఆర్, హరీష్ రావు చాలు అనుకుంటే, కెసిఆర్‌ను ఎందుకు ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు..? ఫ్లోర్ లీడర్‌గా కెసిఆర్‌ను తొలగించాలి. కెసిఆర్‌కు బాధ్యత లేదు. రాష్ట్రం పట్ల పట్టింపు లేదు. కెసిఆర్ కు కేవలం అధికారం కావాలి. అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన లేదని, అటువంటి మంచి అలవాటు ఆయనకు లేదని సిఎం రేవంత్ ఆరోపించారు.

అసెంబ్లీని ప్రజాస్వామికంగా నడుపుతున్నాం
గడిచిన పదేండ్లతో పోలిస్తే అసెంబ్లీని తాము ప్రజాస్వామికంగా నడుపుతున్నామని, సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. ప్రతిపక్షాలకు చాలా సమయం ఇచ్చినా అవకాశం ఇవ్వలేదని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఇంత సుదీర్ఘ చర్చలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు. ఒక్కో రోజు 17 గంటల పాటు సభ జరిగిందని, బిఆర్‌ఎస్ లీడర్లు కెటిఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలే సుమారు 6 గంటల సేపు మాట్లాడారని, తాను, మా డిప్యూటీ సిఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ముగ్గురం కలిసి అంతసేపు మాట్లాడలేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోనూ ఎమ్మెల్యే గా ఉన్నానని, కానీ, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలు పూర్తి ప్రజాస్వామికంగా, బాధ్యతగా జరిగాయని ఆయన తెలిపారు.

ఎంత సమయం చర్చ జరిగిందన్నది ముఖ్యం
చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా తాము బాధ్యతగా వ్యవహారించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు తక్కువ రోజులేం జరగలేదని, బడ్జెట్ పైనా, పద్దుల పైనా, ద్రవ్య వినిమయ బిల్లులపైనా అందరికీ మాట్లాడే అవకాశం దొరికిందన్నారు. వీలైనంత చర్చ జరిగిందని సిఎం రేవంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఉండే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని, కేంద్రం జూలై 23వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. అందుకే 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని, జూలై 31వ తేదీలోపు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందటం తప్పనిసరి అని ఆయన అన్నారు. అందుకే తక్కువ రోజులు అనిపించిందన్నారు. కానీ, ఒక్కో రోజు 17 గంటలు సభ జరిగిందని, ఆ లెక్కన రోజుకు 3 నుంచి 5 గంటలు సభ నడిపిస్తే వారం రోజులు సభ జరిగినట్లేనని ఆయన తెలిపారు. ఎన్ని రోజుల కంటే, ఎంత సమయం చర్చ జరిగిందన్నది ముఖ్యమన్నారు.

సభలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావొద్దు
సభలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని తమ ఆలోచన అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అలాంటి అవసరం సందర్భం వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చని సిఎం రేవంత్ పేర్కొన్నారు. గతంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేయడంతో పాటు తనను ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని సిఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తాను హైకోర్టులో పిటీషన్ వేశానని ఆయన తెలిపారు. ఏదైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే తిరిగి బిఆర్‌ఎస్‌లో చేరారని మీడియా అడిగిన ప్రశ్నకు టీ తాగేందుకు కలుసుకోవటం రాజకీయాలకు, పార్టీల్లో చేరటానికి సంబంధం లేదన్నారు. ఇటీవల 8, 9 మంది బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి నాతో కలిసి టీ తాగారని అంత మాత్రాన మా పార్టీలో చేరినట్టా. ..? అని ముఖ్యమంత్రి బదులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News