కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి
సిఎం రేవంత్‌రెడ్డి ఆఫర్
ప్రధానికి సమర్పించిన ఐదు ప్రతిపాదనలకు
కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి
ఆ బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి,
బండి సంజయ్‌లదే అనుమతులు
సాధిస్తే ఇరువురినీ సన్మానిస్తా మెట్రోరైలు
ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ ముందుకు
రాకుండా అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డే
ఎస్‌ఎల్‌బిసిని పూర్తిగా మూసివేయాలని
కెసిఆర్ భావించారు రాష్ట్రానికి ప్రతినెలా
రూ.22,500కోట్లు అవసరం, కానీ
వస్తున్నది రూ.18,500 కోట్లే జీతాలకు,
వడ్డీలకే రూ.13,300కోట్లు ఢిల్లీలో
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్
కెసిఆర్‌కు కిషన్‌రెడ్డి పార్ట్‌నర్
మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్ నర్ అని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. మెట్రో విస్తరణ జరిగితే తనకు పేరొస్తుందని అనుకుంటున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ హయాంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరగొద్దని భావిస్తున్నారన్నారు. అందుకే కేంద్ర కేబినెట్‌లో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు.
మన తెలంగాణ / హైదరాబాద్ : ఐదు ప్రాజెక్టులు సాధించుకుని వస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రధాన మంత్రికి ఐదు విజ్ఞప్తులు చేసి, వినతిపత్రాలు అందించానని, వాటికి నిధులు తీసుకువస్తే బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి స న్మానం చేస్తానని సీఎం చెప్పారు. మెట్రో విస్తరణ అంశం కేంద్ర కే బినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రె డ్డి ఆరోపించారు. బుధవారం ప్రధానితో సమావేశం అనంతరం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఐ దు రాష్ట్ర విజ్ఞప్తులకు కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరమని స్పష్టం చేశా రు. కేబినెట్ ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లదేనని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బీజేపీ గెలుపుకోసం పనిచేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని ఆలోచనలో బీజేపీ ఉందని సీఎం చెప్పారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఇన్‌వాల్వ్ అయిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తోందని, విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు వచ్చాకే మాట్లాడతానని అన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ సాగుతోందని చెప్పారు.
రాత్రికిరాత్రి తాము ఎవరినీ అరెస్ట్ చేయబోమని, అది తమ విధానం కాదని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే నిర్మించారని, ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఈ ఏడాది 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడు కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిందని, అలాంటపుడు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు నిర్మించారని బీఆర్‌ఎస్ ను ప్రశ్నించారు. కులగణన పై ప్రధానితో చర్చ జరగలేదని, కుల గణనపై పూర్తి గణంకాలు వచ్చాక తీర్మానం చేసి అప్పుడు కేంద్రం దగ్గరకు వెళ్తామన్నారు. మెట్రోరైల్ వ్యవస్థలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఉందని, ఇప్పుడు 9వ స్థానానికి పడిపోవడానికి కారణం బీఆర్‌ఎస్ నేతలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది పై రాజకీయాలు మానుకుని ఎలాంటి పరిహారం పునరావాసం కల్పించాలో విపక్షాలు సూచించాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువులను నోటిఫై చేస్తున్నామని, కొన్నిసార్లు నోటిఫై చేయకుండా ఆక్రమణలు కూల్చివేస్తే కోర్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయన్నారు. దీనికి కారణం హైడ్రా అనేక విభాగాలలో సమన్వయం చేసుకోవాల్సి రావడమేనని, ఒక్కోసారి అది మిస్ అవడం వలన ఇలాంటివి జరుగుతున్నాయని వెల్లడించారు.
నోటిఫికేషన్ చేసి నగరంలోని చెరువులను పునరుద్ధరిస్తామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి ఇబ్బందులు లేవని, ప్రజల్లో అయోమయం సృష్టించడానికే విపక్షాలు ఇలాంటివి కల్పిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్లు రావనే ఎస్‌ఎల్‌బీసీ పనులను పక్కన పెట్టారని సీఎం అన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎస్‌ఎల్బీసీని 100 శాతంపూర్తిచేసి తీరుతామని చెప్పారు. పెరిగిన అంచనాలతో కలిపి రూ. 5000 కోట్ల లోపే ఎస్‌ఎల్‌బీసీ పూర్తవుతుందని, దీని ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు జరగలేదని, కాంగ్రెస్‌కు పేరొస్తుందనే కేసీఆర్ ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పనులు మళ్లీ మొదలయ్యాయని, సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ వద్ద 11 సంస్థలు పనిచేస్తున్నాయని, సొరంగం వద్ద జరిగింది ప్రమాదం అన్నారు.
కాళేశ్వరంలో జరిగింది డిజైన్, నిర్మాణ లోపంతో జరిగిన దుర్ఘటన అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో రావడానికి ప్రధాన కారకుడు జైపాల్‌రెడ్డి అని, కేసీఆర్ వచ్చాక మెట్రో కోసం చేసిందేమీ లేదని, మెట్రో విస్తరణపై కేసీఆర్ పదేళ్లు తాత్సారం చేశారని విమర్శించారు. తన పాలన అద్భుతంగా ఉందని, ఎవరి ఫోన్లు వారే వింటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారని చెప్పారు. తన కేబినెట్ లో అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారని, వారి శాఖలను వారే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్రానికి ఎంత మొత్తంలో పన్నులు కడుతున్నామో రాష్ట్రాలకు అంతే వాటా రావాలని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారని, ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని సీఎం అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీకి రూ.22,500 కోట్లు అవసరమని, ప్రస్తుతం ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే ఉందన్నారు. జీతాలకు రూ.6,500 కోట్లు, వడ్డీలకు రూ.6,800 కోట్లు చెల్లిస్తున్నామని, ఆదాయం రూ.22వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు వివరించారు.