తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే.. మన అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలి.. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదన్నారు. తెలంగాణ తల్లి అంటే గడీలో ఉండే మహిళ కాదు.. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని సిఎం రేవంత్ తెలిపారు.
అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారు అన్న సిఎం జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించారని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చాక జయజయహే తెలంగాణ పాటను నిషేధించినంత పని చేశారని మండిపడ్డారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించే నిర్ణయాన్ని విపక్ష నేత అభినందిస్తారు అనుకున్నా.. ప్రధాన విపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.