Saturday, November 23, 2024

8 సీట్లపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్..టెన్షన్
రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పెండింగ్ జాబితా
కేడర్‌లో సమన్వయానికి సిఎం రేవంత్,
ఇంచార్జి దీపాదాస్ మున్షీ వరుస సమీక్షలు
అసమ్మతి తలెత్తకుండా ఏకాభిప్రాయానికి
యత్నాలు భువనగిరి, ఖమ్మం, వరంగల్
తదితర స్థానాలపై సర్వత్రా ఆసక్తి
పలు చోట్ల కొందరిపై అభ్యంతరాలు,
రంగంలోకి ఎఐసిసి నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాల ఎంపికపై సిఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆశావహులను బుజ్జగించేందుకు సిఎం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. నాయకుల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సైతం ప్రయత్నించడం విశేషం. అయితే ఈనెల 27వ తేదీ లేదా 28వ తేదీన మూడో జాబితాలో మిగిలిన 8 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అసమ్మతి తలెత్తకుండా ఏఐసిసి నాయకులు పక్కా వ్యూహాంతో ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి నాయకులు రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆశావహులను బుజ్జగించే పనిలో ఉన్నట్టుగా సమాచారం. అంతా సద్దుమణిగాక 8 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

అయితే ఈనెల 27వ తేదీన జరిగే సీఈసి ( కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ) సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 17 ఎంపి నియోజకవర్గాలకు గాను ఇప్పటికే రెండు విడతల్లో 9 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఆశావహులు అధికంగా ఉండడం, వాటికి సంబంధించిన సర్వేల నివేదికలను సునీల్ కనుగోలు బృందం ఏఐసిసికి అందించినట్లుగా తెలిసింది.

మంత్రి సీతక్క సూచించిన వారికే ఆదిలాబాద్ టికెట్

ఇప్పటివరకు 9 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా అందులో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, చెవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ, నల్లగొండ రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డి, జహీరాబాద్ సురేష్ షెట్కార్, మహబూబాబాద్ బలరాం నాయక్‌లను అభ్యర్థులను ప్రకటించగా ఇందులో మూడు సీట్లు కొత్తగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఇక ప్రకటించని స్థానాల్లో భువనగిరి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలు ఉండగా ఆయా నియోజకవర్గాల్లో సీట్ల కోసం ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.

కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినా స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించిన వారికే ఆదిలాబాద్ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్‌ను ప్రకటిస్తారని భావించినా ప్రస్తుతం ఆ పేరు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా సమాచారం.

వరంగల్ నుంచి ఇద్దరు..

భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కోమటిరెడ్డి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. వరంగల్ టికెట్ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నప్పటికీ స్థానికంగా అభ్యంతరాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు లేదా ఆయన అన్న నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడికే….!

మెదక్ నుంచి నీలం మధు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఆయన అభ్యర్థిత్వతంపై స్థానికంగా వ్యతిరేకత వస్తున్నట్టుగా తెలిసింది. అయితే మెదక్ సీటున మైనంపల్లి హన్మంతరావు, సినీ నటి విజయశాంతిలు కూడా పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానిక నాయకుల అభిప్రాయాలను సైతం సేకరించింది. చివరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వడంతో….

అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆయా నియోజకవర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా ఆ దిశగా ఏఐసిసి ఆలోచించడం లేదని తెలుస్తోంది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ల ప్రకటనలో ఎక్కడ లోపం ఉంది? స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లు ఎందుకు మారుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం కొత్తగా పార్టీలోకి చేరిన వెంటనే టికెట్లు ఇవ్వడంతో పార్టీలో లుకలుకలు వస్తున్నాయి. ఇప్పటివరకు 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వీటిలో ఏకంగా మూడు స్థానాలకు బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన వలస నేతలకే కట్టబెట్టడంతో పార్టీ కేడర్‌లో వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకత రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పడే ప్రమాదముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

పెండింగ్ స్థానాల్లో ఏం జరుగుతోంది?

ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్, బిజెపి నాయకులకు దీటుగా కాంగ్రెస్ లీడర్లను ఎంపిక చేసే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులు లభించకపోవడంతో వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ఆ పార్టీ టికెట్‌లను కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. అందులో భాగంగా ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని టిపిసిసి ఆలోచిస్తోంది.

మెదక్‌లో నీలం మధు గెలుపుపై…

మెదక్ బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ రఘునందన్ రావును ప్రకటించగా, బిఆర్‌ఎస్ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిని పేరును ప్రకటించింది. వీళ్లిద్దరూ మెదక్‌తో మంచి సంబంధం కలిగిన నేతలు. ఆర్థికంగా బలమైన వ్యక్తులు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నీలం మధు ముదిరాజ్‌ను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీల నేతలను ధీటుగా ఎదుర్కొనే స్థాయి ఆయనకు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఇక కరీంనగర్ బిజెపి అభ్యర్థిగా బండి సంజయ్, బిఆర్‌ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ప్రకటించారు. ఇక్కడ కూడా ప్రాథమికంగా ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలను ఓడించేందుకు చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News