Thursday, December 26, 2024

సాయన్న వారసురాలు లాస్య నందిత మృతి బాధాకరం

- Advertisement -
- Advertisement -

సాయన్న సామాన్య కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగారు
సాయన్న వారసురాలు లాస్య నందిత మృతి బాధాకరం
సాయన్న, లాస్య నందితలు మన మధ్య లేకపోయినా
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు…
లాస్య నందిత మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం
నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్
అతి పిన్న వయసులోనే లాస్య నందిత ఎమ్మెల్యే అయ్యారు: బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సభ రేపటికి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సిఎం సహా అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని సిఎం రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారని ఆయన గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రమాదవశాత్తు ఆమె మరణించడం బాధాకరమని సిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాయన్న మృదుస్వభావి అని, రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో కలపాలని సాయన్న కోరిక అని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరన్నారు. లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారని, కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారి ఆశయాలను, ఆయన చేయాలనుకున్న పనులను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని సిఎం- రేవంత్ రెడ్డి తెలిపారు.

బిఆర్‌ఎస్ సంతాపం
శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బిఆర్‌ఎస్ సంతాపం తెలిపింది. సాయన్న మరణం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చిందని ఎమ్మెల్యే, కెటిఆర్ పేరొన్నారు. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత ఆవేదన కలిగించిందని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

లాస్య నందిత మృతికి బిజెపి సంతాపం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బిజెపి తరఫున శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంతాపం తెలిపారు. అంతకుముందు సిఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారని, లాస్య నందితకు ఎంతో భవిష్యత్ ఉంటుందని భావించామని, దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు మన మధ్య నుంచి తీసుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం: సిపిఐ ఎమ్మెల్యే
లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లాస్య నందిత మృతికి సంతాపం తెలుపుతున్నామని ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

సిఎం రేవంత్ తీర్మానాన్ని బలపరిచిన సభ్యులు
అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కెటిఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖర్ రెడ్డి, కెపి వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబశివరావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గణేశ్.. లాస్య నందిత మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సిఎం రేవంత్ తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వచ్చిన ఆ నలుగురు
ఇక బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం సభకు హాజరయ్యారు. వారంతా అసెంబ్లీలో వెనుక సీట్లలో కూర్చుండి పోయారు. ఆ ఎమ్మెల్యేల్లో పోచారం, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్యలు ఉన్నారు. ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వచ్చి సదరు ఎమ్మెల్యేలు వెనుక వరుసలో కూర్చొవడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News