నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఎఎస్ అధికారి
కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు,
నిపుణుల కమిటీ సూచనలు అనుసరించండి
ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలపై సమీక్షా
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
రెస్కూ పురోగతిని వివరించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ :ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలను వేగంగా అమలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి, సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సిఎస్‌కు ఆదేశించారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సహాయ చర్యలు నిరంతరంగా కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని గు ర్తు చేశారు. సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయ డం, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని, దీనివల్ల సహాయక చర్య లు మరింత సత్వరంగా జరిగేలా చూడాలని చీఫ్ సెక్రటరీని సిఎం రేవంత్ ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని నియమించాలని, వెంటనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సిఎస్‌కు సిఎం రేవంత్ సూచించారు.
రెస్క్యూ ఆపరేషన్లను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలి
ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలకు సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు త్వరగా తీసుకోవాలని సిఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సహాయక చర్యలు మరింత సమర్థంగా అమలయ్యేలా కేంద్రంతో సమన్వయం చేసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఎక్స్‌ఫర్ట్ కమిటీ సూచనలను అనుసరించాలని సిఎం సూచించారు. రెస్క్యూ ఆపరేషన్లను ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగాలని సిఎం అధికారులను ఆదే శించారు. సహాయక చర్యల్లో ఏ మాత్రం అలసత్వం లేకుండా బాధితులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెంచుకొని, సహాయక చర్యలను వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహారిస్తుందని, ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ వెంటనే సహాయ చర్యలు అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు.
సహాయక చర్యల పురోగతిని వివరించిన అధికారులు
ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యలకు సంబంధించి సమాచారాన్ని అధికారులను సిఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తు నిర్వహణ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర వింద్ కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని వారు సిఎంతో చెప్పారు. మొత్తం 700 మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు వారు పేర్కొన్నారు. సొరంగంలో కూలిన రాళ్లు, టిబిఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నామని, ఎప్పటికప్పుడు అక్కడ పేరుకున్న మట్టి, రాళ్ల దిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలగిస్తున్నామని వారు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టించేలా ప్రమాదం జరిగిన రోజున, ఇప్పుడున్న పరిస్థితుల ఫొటోలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వారు ప్రదర్శించారు. ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి,
వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా సాగుతోందని అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్‌గా గుర్తించినట్లు చెప్పారు. జీఎస్‌ఐ, ఎన్జీఆర్‌ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వెలిబుచ్చారు. ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎస్‌ఎల్‌బిసీ సొరంగ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9వ తేదీన లభ్యమైన విషయం తెలిసిందే.