సిఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బిజెపి నేత కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే తనకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.