Monday, December 23, 2024

తెలంగాణపై ఇంత కక్ష.. వివక్షా?: సిఎం రేవంత్ ఫైర్

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు
రాష్ట్రంపై ఇంత కక్ష, వివక్ష ఎందుకు?
రాష్ట్ర హక్కులపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తాం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి
చూపడంపై ప్రధానిపై సిఎం రేవంత్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారని, రాష్ట్రంపై ఇంత కక్ష, వివక్ష ఎందుకని సిఎం రేవంత్ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర హక్కులపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై సిఎం రేవంత్ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మొదటి నుంచి తెలంగాణ పట్ల కక్ష చూపిస్తున్నారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు.

కుర్చీని కాపాడుకునే విధంగా ఈ బడ్జెట్ ఉంని, బీహార్, ఎపిలను మాత్రమే ప్రధాని పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని సిఎం రేవంత్ విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోడీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా, రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. 41 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం ఎన్డీఏ మిత్ర పక్ష రాష్ట్రాలకే దోచిపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్….
రాష్ట్ర ప్రజలు నిర్ణయం వల్లే మోడీ ప్రధాని అయ్యారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. 35 శాతం ఓట్లు, 8 ఎంపి సీట్లిచ్చిన తెలంగాణ ప్రజల పట్ల ప్రధాని మోడీ కృతజ్ఞత చూపించడం లేదని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపిలు నిరసన తెలుపుతారని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో నిరసనకు బిజెపి ఎంపిలు కలిసి రావాలని సిఎం రేవంత్ సూచించారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి నేటి శాసనసభలో పూర్తి స్థాయి చర్చలు పెడతామని, ఎవరు ఎటువైపు ఉన్నారు, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటు న్నారు? చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ కూడా నేటి శాసనసభలో తెలుస్తాయన్నారు.

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ అనుమతితో ఈ చర్చపై ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వ నిరసనను ప్రధాని మోడీకి తెలియజేసేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు బిజెపి, ఎంఐఎం సభ్యులు కలిసి వచ్చే తమ చిత్తశుద్ధి నిరూపించుకో వాలని సిఎం రేవంత్ సూచించారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి పట్ల నిరసనలు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ సైతం కలిసి రావాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేవలం ప్రధాని కుర్చీని కాపాడు కునే విధంగా ఈ బడ్జెట్ ఉందని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్’ అనే బోగస్ నినాదంగా మార్చారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్ అంటూ సిఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విభజన చట్టం కేవలం ఎపికే కాదు.. తెలంగాణకు వర్తిస్తుంది
విభజన చట్టం కేవలం ఎపికే కాదు తెలంగాణకు వర్తిస్తుందని సిఎం రేవంత్ వెల్లడించారు. విభజన చట్టం వంకతో ఎపికి నిధులు కేటాయించారని సిఎం అన్నారు. తెలంగాణకు నిధులిచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని సిఎం రేవంత్ నిలదీశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమయ్యిందని సిఎం ప్రశ్నించారు. ములుగులో గిరిజన వర్సిటీకి నిధులు లేవని సిఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. బిజెపికి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలని, రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. వికసిత భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే, ఆయన మాత్రం దుర్మార్గంగా వ్యవహారి స్తున్నారని సిఎం మండిపడ్డారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరితే పట్టించుకోలేదని సిఎం రేవంత్ విమర్శించారు. విద్య, వైద్యం, నీటి పారుదల రంగాలకు ఎలాంటి సహకారం అందించలేదని ఆయన దుయ్యబట్టారు. ఐటీఐఆర్ కారిడార్‌ను చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని సిఎం రేవంత్ మండిపడ్డారు. బడ్జెట్ ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు లేఖ రాశారని, అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని సిఎం ప్రశ్నించారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని సిఎం మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర హక్కులను మోడీ వద్ద తాకట్టు పెట్టారంటూ సిఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు తీసుకురాకపోతే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News