Wednesday, January 22, 2025

బిజెపి అబద్ధాల వర్శిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట…400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట… ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ధర్మపురి నియోజకవర్గంలోని రాజారాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి ఎంపిగా గడ్డం వంశీకృష్ణను రెండు లక్షల మెజార్టీతో గె లిపిస్తే పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మిస్తామని, నేతకాని కులస్థుల కోసం ప్రత్యేకంగా నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలకుర్తి లిప్ట్ పనులను పూర్తి చేయడంతో పాటు రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. పివి నర్సింహరావు,

గడ్డం వెంకటస్వా మి, దుద్దిళ్ల శ్రీపాదరావు లాంటి మహానేతలు ఈ నియోజకవర్గానికి చెందిన వారేనని, ఈ నియోజకవర్గంలో నల్లబంగారం సిరులున్న ప్రాంతమని అన్నారు. 1990లో సింగరేణి నష్టా ల్లో కూరుకుపోయి మూతపడే పరిస్థితిలో కాకా వెంకటస్వా మి కేంద్రం నుంచి రూ. 1000 కోట్లు తీసుకొచ్చి కాపాడారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మంచిర్యాలలో కరకట్టలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మన్‌కుమార్ గెలిస్తే కొప్పుల ఈశ్వర్ అప్పటి కలెక్టర్ కాళ్లు పట్టుకుని ఎన్నికల ఫలితాలను తారుమారు చేయించి గెలిచాడన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈశ్వర్‌కు తగిన బుద్ది చెప్పి లక్ష్మన్‌కుమార్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిఆర్‌ఎస్‌కు దిక్కు లేక మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఈశ్వర్‌నే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. అయితేఈ ఎన్నికల్లో కొప్పులకు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు.

పలు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తామంటే కనీసం నోరు మెదపలేదని, అలాంటి వ్యక్తి కార్మికుల ఓట్లు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో చచ్చిన పామైందని, కొన ఊపిరితో ఉన్న దానిని పూర్తిగా చంపేయాల్సిన అవసరముందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పడగ మీద గట్టి దెబ్బ కొట్టాలన్నారు. ఇక బిజెపి నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేననని, బిజెపి అంటే అబద్దాల యూనివర్శిటీ అని ఎద్దేవా చేశారు. బిజెపి నేతలు ఏనాడు నిజం మాట్లాడరని, అబద్దాల పోటీ పెడితే వారితో ఎవరూ గెలవలేరన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్ షా, తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టిపిసి ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, గిరిజన యూనివర్శిటీ ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కదానిని ఇవ్వలేదన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదని అలాంటి వారికి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు.

గుజరాత్‌కు మాత్రం లక్షల కోట్లు ఇచ్చారని, గుజరాత్‌లో ఉన్నవాళ్లే దేశ ప్రజలా…తెలంగాణ వాసులు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిపై ప్రజలు ఆలోచన చేయాలని, ఈ ఎన్నికల్లో మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బిజెపికి400 సీట్లు రావాలట… 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్లు రద్దు చేస్తారట అలాంటి వారికి ఓట్లేద్దామా అంటూ సభకు హాజరైన వారిని సిఎం ప్రశ్నించారు.రిజర్వేషన్లు రద్దు చేయాలంటే ఒకటింట మూడో వంతు రాష్ట్రాల ఆమోదం తప్పని సరి అని, అందుకే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బిజెపి పడగొట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మనకు అన్యాయం చేసే వారికి తగిన బుద్ది చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంటే, బిజెపి రిజర్వేషన్లు తొలగించాలని, హక్కులను కాలరాయాలని చూస్తోందన్నారు. దళితులు, గిరిజనుల మీద బిజెపి దాడి చేయబోతోంది… జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

బిజెపి రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్పా… ఇచ్చింది ఏమి లేదన్నారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అడిగితే.. గాడిద గుడ్డు ఇచ్చారని, వరంగల్‌లో కాజిపేట రైల్వే గాడిద గుడ్డు ఇచ్చారని, ఐటిఐఆర్ అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారని,గిరిజన యూనివర్శిటీ అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారన్నారు. బిజెపి ఏం ఇచ్చింది… నరేంద్రమోడీ ఏం తెచ్చిండు అంటూ సిఎం రేవంత్‌రెడ్డి సభికులను ప్రశ్నించగా గాడిద గుడ్డు అంటూ సభికులు సమాధానమిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చినోడికి కర్రు కాల్చివాత పెట్టాలని, పెద్దపల్లి ఎంపిగా గడ్డం వంశీని రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. వంశీని గెలిపిస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని, ధర్మపురి నర్సన్న ఆశీర్వాదం తీసుకుంటానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సభలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మక్కాన్ రాజ్‌సింగ్ ఠాకూర్, విజయరమణారావు, ప్రేంసాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News