కులగణన నచ్చని వారే సర్వేపై
విమర్శలు చేస్తున్నారు బిసిల
హక్కులను కాలరాయడమే
బిఆర్‌ఎస్, బిజెపి లక్ష్యం బిసి
రిజర్వేషన్ల కత్తి ప్రధాని మోడీ
మెడకు చుట్టుకుంటుందని ఆ పార్టీ
నేతల్లో గుబులు ఆసిఫాబాద్
మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్
బాపూజీ పేరు నేతన్నలకు
రూ.1.30 కోట్ల చీరలు నేసే
ఆర్డర్లు మార్కండేయ భవన
నిర్మాణానికి రూ.కోటి పద్మశాలీ
మహాసభలో సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్/నాంపల్లి: బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని నరేంద్ర మోడీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తప్పు ఎక్క డ జరిగిందో నిరూపించమంటే ఎవరూ ముందుకు రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షమంది ఎన్యూమరేటర్లను నియమించి పకడ్బందీగా కులగణన సర్వే నిర్వహించి బీసీల సంఖ్య 56.33 శాతం గా తేల్చామని, అయితే సర్వే తప్పులతడక అని కొం దరు విమర్శిస్తున్నారని,
సర్వేలో ఉన్న తప్పేంటో చూపించమంటే అసెంబ్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్ తోక ముడిచాయని రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన నచ్చని వారే సర్వేపై విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం అఖిల భారత 8వ పద్మశాలీల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి చూపిస్తామన్నారు.
తమ లెక్కలపై బీఆర్‌ఎస్ బీజేపీలు విమర్శలు చేయడం కాదని ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని అసెంబ్లీలో సవాల్ విసిరితే తోకముడిచారన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధమైతే అది కేంద్రంలో నరేంద్ర మోడీ మెడ మీద కత్తిలా మారుతుందని, అందుకే బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి తొండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్‌ఎస్, బీజేపీ లక్ష్యమని మండిపడ్డారు. చివరగా 1939లో కుల గణన జరిగిందని, మళ్లీ ఇప్పటి వరకు జరగలేదని గుర్తు చేశారు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ యాత్రలో దేశంలోని బలహీన వర్గాల కష్టాలను చూశారని..
అందుకే కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం చేయాలనేది రాహుల్ గాంధీ ఆశయమని తెలిపారు. అధికారంలోకి వస్తే బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని, దానికి మొదటి పునాది రాయి తెలంగాణలో పడిందని అన్నారు. పద్మశాలీలు త్యాగంలో ముందుంటారని, కొండా లక్ష్మణ్ బాపుజీ ఇందుకు ఉదాహరణ అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపుజీ తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం నిలబడ్డాడని గుర్తు చేశారు. ఓ వ్యక్తి తెలంగాణ కోసం పార్టీ పెడితే ఆయనకు సొంత కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వలేదని, అలాంటిది ఆ పార్టీకి కొండా లక్ష్మణ్ బాపుజీ సపోర్ట్ చేశారని అన్నారు. నీడనిచ్చిన ఆయనను తెలంగాణ వచ్చిన తర్వాత నిలువనీడ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు కొండా లక్ష్మణ్ బాపుజీకి సరైన గౌరవం ఇవ్వలేదని, చివరకు ఆయన చనిపోతే కూడా మాజీ సీఎం కేసీఆర్ చూసేందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టైగర్ నరేంద్రను ధృతరాష్ట్ర కౌగిలిలో ఖతం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక టెక్స్ టైల్ వర్శిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెట్టి ఆయనను గౌరవించామని తెలిపారు.
మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పద్మశాలీల బతుకమ్మ చీరల బిల్లులు కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, తాము వచ్చాక పెండింగ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. పద్మశాలీల కోసం బీఆర్‌ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పద్మశాలీ బిడ్డ రాపోల్ భాస్కర్‌ను రాజ్యసభకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తు చేశారు. ఏం అవకాశం వచ్చినా పద్మశాలీలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు మహిళలు కట్టుకోలేదని, అవి పొలాల దగ్గర పనికొచ్చాయని విమర్శించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. అయితే నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండవద్దని భావించామని, అందుకే మహిళ సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, ఆ చీరల తయారీ కాంట్రాక్ట్‌ను పద్మశాలీలకు అప్పగిస్తామని తెలిపారు.
నేతన్నలకు 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు : రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నానన్నారు. తనను గుండెల్లో పెట్టుకుంటున్న మీ రుణం తీర్చుకుంటానని సీఎం మాటిచ్చారు. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నదన్నారు. పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదని, త్యాగంలోనూ ముందుటారని అలాంటి పద్మశాలీలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందని, ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలను అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానం అన్నారు.
మార్కండేయ భవనం నిర్మాణానికి రూ.కోటి : మహారాష్ట్రలోని షోలాపూర్ లో మన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు కావాల్సిన పనులు చేయించుకోండి. చేయించుకోకపోతే అది మీ తప్పే అవుతుందని, మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం అన్నారు. మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రావాలని వాటిని ఆమోదించే బాధ్యత తనదని చెప్పారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులో నాకు ఈ పదవి వచ్చిందని, మీ అభిమానాన్నే నేను ఆశిస్తున్నాను. మీరు నన్ను గుండెల్లో పెట్టుకోండి..మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పద్మశాలీలు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు బకాయిలు పెట్టి ప్రభుత్వాన్ని తమకు అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం నాసిరకమైన బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని, తాము వచ్చాక ఆ ఆర్డర్లను రద్దు చేస్తే నేతన్నలు ఇబ్బందులు పడతారని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తన దృష్టికి తీసుకువస్తే రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి 30 లక్షల చీరలు పద్మశాలీలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ , పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు హాజరయ్యారు.