Sunday, December 22, 2024

ఢిల్లీలో దీక్షకు సై అంటే సై

- Advertisement -
- Advertisement -

కేంద్రం వైఖరికి నిరసనగా జంతర్‌మంతర్‌లో ఆమరణ దీక్షకు సిద్ధమన్న బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల సభ్యులు నిధులు తెచ్చుడో…సచ్చుడో, దేనికైనా రెడీ అన్న రేవంత్‌రెడ్డి తెలంగాణకు కేంద్రం నిధుల వివక్షపై గణాంకాలతో వివరణ
కేంద్రానికి తెలంగాణ 10ఏళ్లలో రూ. 3.67లక్షల కోట్లు ఇస్తే కేంద్రం రూ. 1.68లక్షల కోట్లే రాష్ట్రానికి ఇచ్చింది పదేళ్లలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22లక్షల కోట్ల పన్నులిస్తే కేంద్రం విదిల్చింది రూ.6లక్షల కోట్లే ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42%
నిధులు ఇవ్వాలంటే కేంద్రం 32శాతమే ఇస్తున్నది గడిచిన పదేళ్లలో కేంద్రానికి యుపి రూ. 3.47లక్షల కోట్లు ఇస్తే ఆ రాష్ట్రానికి కేంద్రం భారీగా రూ. 6.92లక్షల కోట్లు ఇచ్చింది తెలంగాణ డిమాండ్లను పరిష్కరించేదాకా పార్టీలకతీతంగా
ఢిల్లీని ముట్టడిద్దాం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పిలుపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది.

తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలి
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం తీర్మానంపై సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలని కోరారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాడ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడిందని, అన్ని రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని పేర్కొన్నారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసి దేశాన్ని పరిపుష్ఠం చేసిందని, భారత్ ఆర్థికంగా నిలదొక్కుకుందని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని సిఎం తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఎన్నో అంశాలు పెట్టారని గుర్తుచేశారు. పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లలో హామీలను పూర్తి చేయాల్సి ఉందని,అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ హక్కులను పట్టించుకోలేదని మండిపడ్డారు. నిలదీసి అడగాల్సిన రాష్ట్రప్రభుత్వం గతంలో పదేళ్లు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేలా తాము ప్రధాని మోదీని కలిసి నిధులు అడిగినా, కేంద్రం నిధులు కేటాయించడంలో మొండిచేయి చూపిందని ఆక్షేపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడుదామని ఈ సందర్భంగా కెటిఆర్ పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామని సూచించారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్రమంత్రులు కూడా నిధులు తెస్తారో… రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని పేర్కొన్నారు. దీక్ష గురించి కెటిఆర్ ప్రతిపాదించారని, దీక్షకు తాను సిద్ధం… కెసిఆర్‌ను రమ్మనండి సిఎం అన్నారు.

కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇవ్వడం లేదు
తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే మనకు కనీసం 45 పైసలు కూడా తిరిగి రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో జరిగిన వివక్షను నిరసిస్తూ ఈ నెల 27న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఈ పదేళ్లలో పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయని..

కేంద్రం మాత్రం తెలంగాణకు పదేళ్లలో కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్రానికి దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల నుంచి రూ.22 లక్షల కోట్లకు పైగా వెళితే కేవలం రూ.6 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అదే ఉత్తరప్రదేశ్ కేవలం రూ.3.41 లక్షల కోట్లు చెల్లిస్తే దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆ రాష్ట్రానికి ఇచ్చిందని విమర్శించారు. బీహార్ నుంచి ఒక రూపాయి వెళితే రూ.7 తిరిగి ఇస్తోందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలన్నారు. మోదీ ఏమైనా గుజరాత్‌లోని తన ఎస్టేట్‌లు అమ్మి ఇస్తున్నాడా..? అని సిఎం ధ్వజమెత్తారు.

ఫెడరల్ స్ఫూర్తితో మోదీని కలిశా… తలొంచడం కాదు
ఫెడరల్ స్ఫూర్తితో ప్రధాని మోదీని పలుమార్లు కలిసి నిధులు కోరానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దన్న అని పిలిచి… ఆ పాత్ర పోషించండని తాను మోదీని కోరానని తెలిపారు. పెద్దన్న అని పిలిస్తే మోదీ తనకు ఇచ్చేదేమీ లేదని, తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఒక మెట్టు దిగి ప్రధాని మోదీతో సఖ్యతగా ఉన్నానని వివరించారు. తనకు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే సిఎం అయ్యానని చెప్పారు. కానీ పెద్దన్న అన్నంత మాత్రాన తనకు వచ్చిందేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మాత్రమే కేంద్రంతో బాగుండే ప్రయత్నం చేశామన్నారు. తమది ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేసే ఆలోచన తప్ప… ఎవరి ముందో తలవంచడం కాదని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదని… కక్ష అని మండిపడ్డారు.

తెలంగాణ కోసం తామెన్నో త్యాగాలు చేశామని కొంతమంది చెబుతున్నారని, కానీ ఏ పదవి లేని రోజున వారికి సోనియాగాంధీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము అసెంబ్లీలో చర్చను తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తొలి నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సిఎంగా నీతి అయోగ్ సమావేశానికి వెళ్లడం లేదని అసెంబ్లీ వేదికగా సిఎం ప్రకటించారు. మన బహిష్కరణకు సభ మొత్తం ఆమోదం తెలపాలని కోరుతున్నానన్నారు. బడ్జెట్‌లో మన హక్కులకు భంగం కలిగాయని, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని, ప్రాజెక్టులకు నిధులు రాలేదని చెప్పారు. అందుకే మనం ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిరసన తెలుపుతున్నామని అన్నారు.

అన్నీ మేమే చేస్తే మీరేం చేస్తారు : హరీశ్‌రావు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తాము అఖిలపక్షానికి, ధర్నాకు, దేనికైనా సిద్ధమని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం తాము సిద్ధమని స్పష్టం చేశారు. కానీ రుణమాఫీ గురించి తనను, నిరుద్యోగుల గురించి కెటిఆర్‌ను, ఇప్పుడు కెసిఆర్‌ను దీక్ష చేయమని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని, అన్నీ తామే చేస్తే ఇక మీరేం చేస్తారని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమది ఉద్యమస్ఫూర్తి అని, కానీ రాజీనామా చేయకుండా పారిపోయింది మీరే అని విమర్శించారు. తెలంగాణవాదులపైకి తుపాకీ గురిపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు పొందారని ఎద్దేవా చేశారు.

పదవులను తృణపాయంగా వదిలేశామన్నారు. తెలంగాణ కోసం బిఆర్‌ఎస్ త్యాగాలు చేసిందన్నారు. కెసిఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడని పేర్కొన్నారు. నాడు సోనియాను దెయ్యం, రాహుల్ గాంధీని పప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏకగ్రీవ తీర్మానానికి తాము ఆమోదం తెలుపుతామన్నారు. అయితే దీక్షకు కెసిఆర్ ఎందుకు? నువ్వు దీక్ష చెయ్… మేం నీ చుట్టూ ఉంటామని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి దీక్ష చేస్తామంటే తాము రక్షణగా ఉంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎంఎల్‌ఎలం అందరం ఆయన వెంట ఉంటామని కెటిఆర్ అన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై తీర్మానానికి శాసన సభ ఆమోదం
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసన సభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో సవరణలు చేయాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా విభజన చట్టాలను అమలు చేయడం లేదన్నారు. తీర్మానంపై అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయం తెలిపారు. ఈ అంశంపై చర్చను నిరసిస్తూ బిజెపి సభ్యులు అంతకుముందే శాసన సభ నుంచి వాకౌట్ చేశారు. తీర్మానానికి బిఆర్‌ఎస్ మద్దతు తెలిపింది.

తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరణ చేస్తున్నామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం సవరించిన బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ పునరుద్ధరణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పీఎంకేఎస్‌వైలో అనుమతి ఇవ్వాలని, ఎన్‌టిపిసి ద్వారా 4 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 2,400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.

శాసన సభ తీర్మానం ఇదే…
“డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య… అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత…ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణిని కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రం అవసరమైన, అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది. పార్లమెంట్‌లో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది.

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేకసార్లు అభ్యర్థనలను అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా బడ్జెట్‌లో తెలంగాణపై పూర్తిగా వివక్ష చూపింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి” అని శాసనసభ తీర్మానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News