Sunday, November 24, 2024

‘టచ్ చేసి చూడు… అంతు చూస్తాం’: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారు
‘చేతనైనే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి… అంతు చూస్తాం’
అధికారం పోయినా బిఆర్‌ఎస్ నాయకుల్లో అహంకారం తగ్గడం లేదు
డిసెంబర్ 9వ తేదీలోపు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం
రాజీవ్‌గాంధీ జయంతి ఉత్సవాల్లో బిఆర్‌ఎస్ నాయకులపై సిఎం రేవంత్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారు, ‘చేతనైనే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తాం’ అని సిఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా బిఆర్‌ఎస్ నాయకుల్లో కొందరికి అహంకారం తగ్గడం లేదని ఆయన మండిపడ్డారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి సిఎం రేవంత్ నివాళులర్పించారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎంపిలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, ఇతర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ సచివాలయం ఎదుట కెసిఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పదేళ్లలో ఏనాడూ విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాని వాళ్లకు ఈరోజు దానిని ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని సిఎం రేవంత్ ప్రకటించారు. ఈ విగ్రహాన్ని సచివాలయం లోపలే పెడతామని ఆయన స్పష్టం చేశారు.

రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తాం
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాక ఏ రోజు తొలగిస్తారో చెబితే తాము కూడా వస్తామని సిఎం రేవంత్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. బిఆర్‌ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం సామాజిక బహిష్కరణ చేస్తుందని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన కొనియాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని మంగళవారం ప్రారంభించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నామని, కానీ, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండటం మూలంగా దానిని వాయిదా వేసుకున్నామని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహం అమరవీరుల జ్యోతి పక్కన ఉండటం సముచితం అని ఆయన అన్నారు. ఆయన విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సిఎం రేవంత్ వెల్లడించారు. అధికారం కోల్పోయేసరికి బిఆర్‌ఎస్ నేతలు విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు.

దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీ
దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమూల మార్పులు, విప్లవాత్మక చైతన్యానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని సిఎం రేవంత్ కొనియాడారు. కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆనాడే రాజీవ్ చెప్పారని, టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని సిఎం రేవంత్ కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేసింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా రాజీవ్‌గాంధీ అని సిఎం రేవంత్ గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని, దేశ యువతకు ఆయన స్ఫూర్తినిచ్చారన్నారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబాన్ని అవమానిస్తున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు
సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని సిఎం రేవంత్ అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. సౌత్‌కొరియాలోని ఓ యూనివర్శిటీలో 16 మందికి ఒలంపిక్స్ పతకాలు వచ్చాయని, అందుకే తెలంగాణలోనూ యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఒలంపిక్స్ లక్షంగా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని ఆయన తెలిపారు. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News