Monday, March 17, 2025

పాత్రికేయానికి సరిహద్దురాళ్లు పాతాలా?

- Advertisement -
- Advertisement -

సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2005లో హైదరాబాద్ జూబ్లీహాల్‌లో ఒక జాతీయ సదస్సు జరిగింది. ఆనాటి కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి సూదిని జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ‘న్యూస్ మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా వద్దా?’ అనే అంశం మీద ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జైపాల్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయినప్పుడు వాటికి వేరే శిక్షలు వేయవలసిన అవసరం ఏమీ ఉండదని, విశ్వసనీయత కోల్పోవడమంటేనే తనను తానే ఉరితీసుకున్నంత ఘోరమైన నేరమని అన్నారు. అదే సభలో మరో ముఖ్య అతిథి, అప్పటి ప్రెస్‌కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ జీఎన్ రే మాట్లాడుతూ ‘లక్ష్మణ రేఖ అనేది రామాయణ కాలంలో సీత కోసం లక్ష్మణుడు గీసినది, ఇవాళ మీడియాకు ఇతరులు ఎవరైనా ఇలాంటి రేఖను గీయవలసిన అవసరం ఉన్నదా? స్వీయ నియంత్రణకు మించిన లక్ష్మణ రేఖ ఏం ఉంటుంది? అందుకని మీడియా ఈ రేఖను తానే గీసుకోవాలి. దాన్ని దాటి పోకుండా తనను తాను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి’ అన్నారు.
ఈ 20 ఏళ్లలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే మళ్లీ ఒకసారి 2005 నాటికంటే కూడా తీవ్రమైన మేధోమథనం జరగవలసిన అవసరం ఉన్నది అనిపిస్తుంది. శనివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ మీడియా పోకడలమీద సభలో చర్చకు అనుమతించాలని, ఇది చట్టాలు చేసే సభ కాబట్టి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నదని తాము భావిస్తున్నామని చెప్పారు. అయితే జర్నలిస్టులు ఎవరో, జర్నలిస్టులు కానివారు ఎవరో నిర్ధారించేందుకు జర్నలిస్టు సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడాల్సిందిగా సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ‘జర్నలిస్టులు ఎవరో నిర్ధారించండి, వారు తప్పులు చేస్తే ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించండి. కాని జర్నలిస్టులు కానివారు ఆ ముసుగులో వస్తే మాత్రం కఠినమైన చర్యలు చట్టపరంగానే తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
ఇవాళ ముఖ్యమంత్రి ఇంత తీవ్రస్థాయిలో మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? 2005లో ప్రెస్ అకాడమీ లక్ష్మణ రేఖ అవసరమా లేదా/అనే అంశం మీద జాతీయ సదస్సు నిర్వహించిన నాటికి ఈ రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలోనే ప్రస్తుతం మనం చూస్తున్న సామాజిక మాధ్యమాలనేవి లేవు. మళ్ళీ మాట్లాడితే, అప్పటికీ ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలోని 24 గంటల న్యూస్ ఛానళ్లు కూడా శైశవ దశలోనే ఉన్నాయి. 20 ఏళ్లలో పరిస్థితి చూసినట్లయితే ప్రింట్ మీడియా వెనకపడిపోయి ఎలక్ట్రానిక్ మీడియాలోని 24 గంటలు న్యూస్ ఛానళ్ళు వాటికి మించి వందలు వేలు, మళ్లీ మాట్లాడితే లక్షల సంఖ్యలో వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర డిజిటల్ ప్లాట్ ఫారాలు తామరతంపరగా వచ్చేశాయి. వీటిని నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు లేవు. ఇవి ఏ చట్టపరిధిలోకీ రావు. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది బహుశా అటువంటి వాటిని ఉద్దేశించికావచ్చు. ఎందుకంటే యూట్యూబ్ చానళ్ళలో లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఏ కట్టడి, సంయమనం లేకుండా ఏదిబడితే అది రాస్తున్న, మాట్లాడుతున్న వాళ్ళందరూ జర్నలిస్టులు అవుతారా?
యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్‌సైట్లు కాకుండా ఏ విలువలూ, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవస్థలను, వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేస్తున్న, రాజకీయ వ్యాపార ప్రయోజనాల్ని ఆశించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 24 గంటలు న్యూస్ ఛానళ్ళకు కూడా కొదవలేదు ఇవాళ. అసలు ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు రావడానికి కారణం- ప్రింట్ మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం, ఎదుటిపక్షానికి జనంలోకి వెళ్లేందుకు చోటులేకపోవడం కూడా కారణమేమో.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉచ్ఛరించలేని భాషలో బూతులు తిడుతూ తనది మహబూబాబాద్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ‘పోలీసు రక్షణ లేకుండా వచ్చిఉంటే రేవంత్ రెడ్డిని చంపేసేవాణ్ణి’ అన్నమాట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది. ఆ ఛానల్ ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిత ఛానల్ అని విమర్శ ఉంది. మొన్నటిదాకా దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ ముఖ్యనాయకుడు ఒకరు సొంతంగా నిధులు సమకూర్చి ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం కొనసాగించడానికి ఇటువంటి పలు ఛానళ్ళను ఏర్పాటు చేయించారనే విమర్శ ఉంది. అది నిజమా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే ఆ ఛానల్లో, ఆ వార్త ప్రసారం చేసిన అనంతరం, దాని అధినేతను అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు చెప్పిన సమాచారమే మన వద్ద ఉంది.
సరే, ఎవరో ముఖ్యమంత్రిని దూషిస్తే, ఆయనని చంపుతామని బెదిరిస్తే ఇద్దరు జర్నలిస్టులను, అందునా మహిళలను అదీ తెల్లవారుజామున అరెస్టు చేయడం సబబేనా అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి నిన్నమొన్నటి దాకా అధికారంలో ఉండిన పక్షం విమర్శల దాడి చేసింది. వాళ్ళు జర్నలిస్టులే కావాల్సిన అవసరం లేదు, మహిళలైతే చాలు అటువంటి సమయంలో అరెస్టు చేయడం సరికాదు. జర్నలిస్టులు అయినంతమాత్రాన అరెస్టు చేయకూడదా అన్న ప్రశ్నకు ఇక్కడ జైపాల్ రెడ్డి గారు అన్న మాటను ఒకసారి గుర్తు చేసుకుని ‘విశ్వసనీయతను కోల్పోవడం అంటే వారికి వారు ఉరి వేసుకోవడం లాంటిదే’ అని రేవంత్ రెడ్డి కూడా వదిలేయవచ్చు. కానీ ఈ ధోరణిని అరికట్టకపోతే ఎంత దూరంపోతుంది? ప్రధాన స్రవంతి మీడియా దీన్ని జర్నలిజం అని ఒప్పుకోడానికి సిద్ధంగా లేదు.
ఈ కేసులో అరెస్ట్ అయిన మహిళను పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండోసారి. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యతిరేకంగా ఒక టీవీలో కథనాలు ప్రసారం చేశారని తనపై బిఆర్‌ఎస్ నేతలు కక్షగట్టినట్లు అప్పట్లో ఆమె తెలిపారు. 2019 జనవరిలో ఆమె మీద ఒక వ్యక్తి ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల కేసుపెట్టగా, జులైలో ఆమెను ఇలాగే ఇంటికొచ్చి మరీ బలవంతంగా అరెస్టు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన బిఆర్‌ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగితే దాన్ని ఫాసిజం అనడం హాస్యాస్పదంగా ఉన్నది.
ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభలో తన ప్రసంగంలో ‘విశృంఖలత్వాన్ని ఆపాలి’ అని అన్నారు. ఈ విశృంఖలత్వం ఎవరివల్ల జరుగుతున్నది? ఇటువంటి ధోరణి అసలు జర్నలిజం అవుతుందా? మీడియాకి ‘గేట్ కీపింగ్’ ఉంటుంది. ఒక విలేఖరి రాసే వార్త లేదా వీడియో బయటికి రావడానికి ముందు అది సరైన వార్త అవునా కాదా, దాన్ని ప్రచురించవచ్చునా, ప్రసారం చేయవచ్చునా లేదా అని చూడవలసిన బాధ్యతను నిర్వర్తించేవాళ్లే గేట్ కీపర్లు. ఇప్పుడు అటువంటివి లేవు. తామరతంపరగా వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళపైన పర్యవేక్షణ లేదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు లేరు. అలాగని, అన్ని యూట్యూబ్ ఛానళ్లను ఒకేగాటన కట్టలేం. ఎంతో మంచి కంటెంట్‌ను ఇస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రవీష్ కుమార్, ధ్రువ రాథోడ్, శేఖర్ గుప్తా, సిద్ధార్థ వరదరాజన్ వంటివారు నిర్వహిస్తున్న కొన్ని యూట్యూబ్ చానళ్ళు చక్కటి కంటెంట్ ఇస్తున్నాయి.
ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టుకు దారితీసిన మహబూబాబాద్ రైతు అని చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడిన మాటల వీడియో ప్రత్యక్ష ప్రసారం ఏమీ కాదు… ఎడిట్ చేయడానికి వీలులేకపోయింది అని సమర్ధించుకోడానికి. అంతేకాదు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడకూడదు అన్న మహిళ తానే స్వయంగా ఆ వార్త మొత్తాన్ని తన ట్విట్టర్‌లోనో, ఇంకెక్కడో పోస్ట్‌చేసి బహుళ ప్రచారం కల్పించారు. సావకాశంగా ఎడిట్ చేసుకొని ప్రసారం చేయగలిగినంత సమయం ఉన్నా, ఆ ఛానల్ వారు అభ్యంతరకరమైన భాషను తొలగించే ప్రయత్నంకానీ, ‘ముఖ్యమంత్రినే చంపేసేవాళ్ళం’ అనే మాటని తొలగించే ప్రయత్నం కానీ చేయకుండా పైగా తమ మీద కేసులు పెడతారేమో అని కూడా చెప్పుకున్నారు. అడ్డగోలుగా, అసభ్యకరమైన మాటలను జనంలోకి వదలడమే కాకుండా దీని పర్యవసానంగా ప్రభుత్వం తమపైన చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్టయితే హీరోలమైపోతాం అనుకున్నారు. అదేం జరగలేదు. బాధ్యత కలిగిన జర్నలిస్ట్ సంఘాలు గాని, మీడియా సంస్థలు గాని దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఇంత జుగుప్సాకరమైన వీడియోలను జనంలోకి వదిలిన విశృంఖలత్వాన్ని చీదరించుకున్నారు కూడా. ఈ కారణంవల్లనే కదా ముఖ్యమంత్రికి శనివారంనాడు శాసనసభలో ఒక చట్టం తెస్తాం అనే అవకాశం లభించింది. 2005 నాటి జాతీయ సదస్సులో స్వీయ నియంత్రణ లేకపోతే ఇంకెవరో వచ్చి నియంత్రిస్తారు, అక్కడిదాకా తెచ్చుకోవద్దు అని రామోజీరావు, ఎంజె అక్బర్, కుల్దీప్ నాయర్, రాజ్దీప్ సర్దేశాయి, స్వామి అగ్నివేశ్, శాంతాసిన్హా, కేజీ కన్నబిరాన్ వంటి ప్రముఖులు హెచ్చరించారు. ఇవాళ సామాజిక మాధ్యమాల పేరిట కొందరు యూట్యూబర్లు సంచలనాలకోసమో, ఇతరేతర ప్రలోభాలకు లొంగి లేదా ప్రయోజనాలు ఆశించో రాస్తున్న, ప్రసారం చేస్తున్న చెత్త కారణంగా, అక్కడిదాకా తెచ్చారనిపిస్తున్నది.
20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వార్తా మాధ్యమాలకు లక్ష్మణ రేఖ అవసరమా అన్న అంశాన్ని కొద్ది మార్పులు చేసి వార్తామాధ్యమాలకు ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర వెబ్ సైట్లకు మధ్య ఒక స్పష్టమైన గీత గీయవలసిన అవసరం చాలా ఉందనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నదంతా జర్నలిజానికి, ప్రభుత్వానికి మధ్య వివాదం కాదు, ఇది ఒక యూట్యూబ్ ఛానల్‌కు, అధికారులకు మధ్య జరుగుతున్న వివాదం. ఈ యూట్యూబ్ ఛానళ్ళకు ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి చట్టాలు వర్తించవు కాబట్టి వీరి చర్యల్ని సమర్థించవలసిన అవసరం లేదు. వాటిమీద జరిగే చట్టపరమైన చర్యలను వ్యతిరేకించవలసిన అవసరం లేదు. శాసనసభలో శనివారంనాడు ముఖ్యమంత్రి అన్నట్టు జర్నలిజాన్ని పునర్ నిర్వచించుకోవాల్సిన సమయం వచ్చిందా?

‘‘వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయినప్పుడు వాటికి వేరే శిక్షలు వేయవలసిన అవసరం ఏమీ ఉండద ని, విశ్వసనీయత కోల్పోవడమంటేనే తనను తానే ఉరితీసుకున్నంత ఘోరమైన నేరమని జైపాల్ రెడ్డి అన్నారు. అదే సభలో మరో ముఖ్య అతిథి, అప్పటి ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ జీఎన్ రే మాట్లాడుతూ ‘లక్ష్మణ రేఖ అనేది రామాయణ కాలంలో సీత కోసం లక్ష్మణుడు గీసినది, ఇవాళ మీడియాకు ఇతరులు ఎవరైనా ఇలాంటి రేఖను గీయవలసిన అవసరం ఉన్నదా? స్వీయ నియంత్రణకు మించిన లక్ష్మణ రేఖ ఏం ఉంటుంది? అందుకని మీడియా ఈ రేఖను తానే గీసుకోవాలి. దాన్ని దాటి పోకుండా తనను తాను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి’ అన్నారు.’’

‘‘గత 20 ఏళ్లలో పరిస్థితి చూసినట్లయితే ప్రింట్ మీడియా వెనక పడిపోయి ఎలక్ట్రానిక్ మీడియాలోని 24 గంటలు న్యూస్ ఛానళ్ళు వాటికి మించి వందలు వేలు, మళ్లీ మాట్లాడితే లక్షల సంఖ్యలో వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర డిజిటల్ ప్లాట్ ఫారాలు తామరతంపరగా వచ్చేశాయి. వీటిని నియంత్రిం చడానికి ఎటువంటి చట్టాలు లేవు. ఇవి ఏ చట్ట పరిధిలోకీ రావు. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది బహుశా అటువంటివాటిని ఉద్దేశించి కావచ్చు.’’

‘‘ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభలో తన ప్రసంగంలో ‘విశృంఖలత్వాన్నిఆపాలి’ అని అన్నారు. ఈ విశృంఖల త్వం ఎవరివల్ల జరుగుతున్నది? ఇటువంటి ధోరణి అసలు జర్నలిజం అవుతుందా? మీడియాకి ‘గేట్ కీపింగ్’ ఉంటుంది. ఒక విలేఖరి రాసే వార్త లేదా వీడియో బయటికి రావడానికి ముందు అది సరైన వార్త అవునా కాదా, దాన్ని ప్రచురించవచ్చునా, ప్రసారం చేయవచ్చు నా లేదా అని చూడవలసిన బాధ్యతను నిర్వర్తించేవాళ్లే గేట్ కీపర్లు. ఇప్పుడు అటువంటివి లేవు. తామరతంపరగా వచ్చిన యూట్యూబ్ చానళ్ళ పైన పర్యవేక్షణ లేదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు లేరు.’’

‘‘ప్రస్తుతం జరుగుతున్నదంతా జర్నలిజానికి, ప్రభుత్వానికి మధ్య వివాదం కాదు, ఇది ఒక యూట్యూబ్ చానల్ కు, అధికారులకు మధ్య జరుగుతున్న వివాదం. ఈ యూట్యూబ్ చానళ్ళకు ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి చట్టాలు వర్తించవు కాబట్టి వీరి చర్యల్ని సమర్థించ వలసిన అవసరం లేదు. వాటిమీద జరిగే చట్టపరమయిన చర్యలను వ్యతిరేకించవలసిన అవసరం లేదు.’’

amar devulapalli

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News