Monday, January 20, 2025

ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు వారిద్దరూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో శుక్రవారం భేటీ కానున్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవుల భర్తీ, కొత్త పిసిసి చీఫ్ నియామకాలకు సంబంధించి ఈ భేటీలో వారు చర్చించనున్నట్టుగా తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సిఎం, డిప్యూటీ సిఎంలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సమావేశమై సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు వరంగల్‌లో నిర్వహించే కృతజ్ఞత సభకు ఆహ్వానించనున్నారు. వీరిద్దరితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలిసింది.

ఏఐసిసిల మార్పు నేపథ్యంలో
దీంతోపాటు ఏఐసిసి ముఖ్య నాయకుల మార్పు నేపథ్యంలో సిఎం రేవంత్, డిప్యూటీ సిఎంలకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో పాటు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌లను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దీపాదాస్‌ను పశ్చిమ బెంగాల్ కు పంపి, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన భూపేష్ భగీల్‌ను తెలంగాణకు నియమించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోంది. కానీ, కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం దీనిపై కూడా అధిష్టానంతో సిఎం, డిప్యూటీ సిఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు పోటీపడుతుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే పలువురిని పేర్లకు సంబంధించి సిఎం రేవంత్ అధిష్టానంతో చర్చించి వాటిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి అనుకూలమైన వారికే కేబినెట్‌లో చోటు
ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఏఐసిసి హామీతో ఇద్దరు ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండడం సమస్యగా ఉత్పన్నమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి. ఏఐసిసి స్థాయిలో కసరత్తు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలమైన వారికే కేబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంటుంది. అలా జరిగినప్పుడే ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగుతుంది. మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో 15 శాతం మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డితోపాటు 12 మంది మంత్రి వర్గంలో ఉన్నారు. మరో ఆరుగురికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉండడం విశేషం.

బిసి 1, మైనార్టీ 1, రెడ్డిలకు 2, లంబాడీలకు 1, ఎస్సీలకు 1
అందులో ప్రధానంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో ముఖ్యులుగా ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఏఐసిసి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా బిసి సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, మైనారిటీ కోటా కింద ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీఖాన్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మిగిలిన రెండింటిలో ఒకటి లంబాడీ సామాజిక వర్గానికి, మరొకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసిసి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అదిలాబాద్ జిల్లాకు ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిని ఇస్తామని ఏఐసిసి హామీ ఇచ్చింది. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసిసిపై పలువురు సీనియర్ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News