తెలంగాణలో కాంగ్రెస్‌కు రాబోయే లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఛాలెంజిగా కూడా భావించాలి. కాంగ్రెస్ పార్టీలో ఆయన నిశ్చింతకి, సుస్థిరతకు ఇవి ఎంతో కీలకం. అత్యధిక సీట్లు సాధించి చూయిస్తే ఆయన అధిష్టానం ముందు బలపడడంతో పాటు పార్టీలో సీనియర్ల కినుకును కూడా వదిలించవచ్చు. అన్ని విధాలుగా రూట్ క్లియర్ అయి మిగితా కాలాన్ని సునాయాసంగా దాటవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు ప్రజలిచ్చే తీర్పు అని కూడా ఆయన చెప్పుకోవడంలో ఎంతో ధీమా కనబడుతోంది. క్షణం వదలకుండా శ్రమించి ఆరు హామీలను జనానికి రుచి చూయించి లోక్‌సభ ఓట్లకు పునాదిని వేసుకున్నారు. ఇంకా అదనపు బలం కావాలి. ప్రత్యర్థులు బలహీనపడాలి. అందుకే తన 100 రోజుల వ్రతం ముగియగానే తమ పార్టీ ద్వారం దగ్గర కొంత కాలంగా పడిగాపులు పడుతున్న భారాస ఎంపిలు, ఎంఎల్‌ఎలను చేరదీస్తున్నారు.
అలా పార్టీ తలుపులు తెరిచి తమకు ఓట్లు పెరిగే దిశగా, గెలుపు గుర్రాల చేర్పులో పడ్డారు. గేట్లు పూర్తిగా తెరిస్తే భారాస ఖాళీ అని కూడా సవాలు విసిరారు. దీని ద్వారా ఆయన కాంటాక్ట్‌లో ఎంత మంది భారాసులు ఉన్నారో అర్థమవుతోంది. భారాసలో ఉన్న 39 లో మిగిలేదెవరో తెలియని పరిస్థితి నెలకొంది. 2015లో హైదరాబాద్ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భారాస ప్రణాళికనే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది. కార్పొరేషన్ గెలుపు కోసం ఆనాడు కెసిఆర్ నగరంలో గెలిచిన ఇతర పార్టీల ఎంఎల్‌ఎలను అదిరించి, బెదిరించి ఆనాటి టిఆర్‌ఎస్‌లో చేర్చుకొని సిటీలో తమ బలం పెంచుకొని బల్దియాను హస్తగతం చేసుకున్నారు. స్థూలంగా అదే సూత్రాన్ని ఇప్పుడు రేవంత్ చేపట్టినా ఆయన అడిగే అవసరం లేకుండానే స్వయంగా భారాస సభ్యులే కాంగ్రెస్‌లోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక నా రాజకీయం చూయిస్తా అని సవాల్ విసురుతున్న రేవంత్‌ను కలుస్తున్న భారాస నేతల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇవి తప్పని చర్యలైనా దీర్ఘకాలంలో చిక్కులు కొనితెచ్చుకున్నట్లవుతుంది. నిన్నటి దాక శత్రువుగా చూసిన ప్రత్యర్థి తమ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బ తిని కింది స్థాయిలో పార్టీ వేళ్ళు బలహీనమవుతాయి. ఆ పరిస్థితిని భారాస ఎదుర్కొంది. పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే ధోరణి ఆరోగ్యకరం కాదు.ఇక అసలు విషయానికొస్తే మన నాయకులు ఎంత నీతివంతులో వాళ్లే స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. కెసిఆర్ వెంట ఉంటే లాభమేమి లేదని అటు బిజెపి లేదా ఇటు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఈ రకంగా ఏ పార్టీ అయినా పేక మేడనే అని అర్థమవుతోంది. గెలుపే దాని ఊతకర్ర. అది జారిపోతే కూలిపోవాల్సిందే. గెలుపోటములకు అతీతంగా పార్టీని పట్టుకొని నిలిచే సంప్రదాయం గంగలో కలిసిపోయింది. రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తల రాక కూడా దీనికి కొంత కారణం అనుకోవచ్చు.
రాజకీయాల వల్ల వారికి రెండు రకాలుగా ప్రయోజనమే. కోట్లు ఖర్చు చేసినా రాని ప్రోటోకాల్ గౌరవం అనుభవించవచ్చు. తమ వ్యాపార పనులు సునాయాసంగా చక్కదిద్దుకోవచ్చు. చట్టాన్ని అతిక్రమించినా అడిగేవాడు ఉండడు. అయితే వీరి డబ్బే వీరికి బలం. ప్రజల పట్ల ఎలాంటి బాధ్యతను తీసుకోరు. పార్టీని వీడడానికి కూడా వెనుకాడరు. ఉన్న పార్టీతో ఎలాంటి భావోద్వేగ అనుబంధం ఉండదు. వీరి చేరిక అన్ని పార్టీలకు ముప్పే. పార్టీని, హోదాని వాడుకోవడమే తప్ప కష్టకాలంలో పార్టీకి అండగా నిలవరు. దీనికి ఉదాహరణగా భారాసను వీడాలనుకుంటున్న ఎందరో నేతల పేర్లు చెప్పవచ్చు.
మరోవైపు భారాస పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనేలా ఉంది. ఎందుకంటే ఎందరికో ఆ పార్టీ రాజకీయ ప్రవేశం కల్పించింది. రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యాపారాల్లో, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారిని పిలిచి పార్లమెంట్‌కు పంపింది. ఇప్పుడు వాళ్లే ముందుగా పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్నారు. బిజెపి, కాంగ్రెస్‌లో చేరి మళ్లీ లోక్ సభ సీట్లు సంపాదించుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బే ప్రధానం అయినందున పార్టీల బలోపేతం కోసం ఇలాంటి వారిపై పార్టీలు ఆధారపడక తప్పడం లేదు. అయితే ఓడిన పార్టీ జెండా మోసే ఓపిక, అవసరం వీరికి ఎందుకుంటుంది?
మాజీ మంత్రి మల్లారెడ్డి చట్టసభలో అధ్యక్షా!
అనాలనే కాంక్షను చంద్రబాబు తీర్చినా, కెసిఆర్ ఆయనకు ఎన్నో ఇచ్చారు. పార్టీకి ఆర్థికంగా తోడు ఉంటాడనే భావనతో ఆయన పట్ల బారా ఖూన్ మాఫ్ అన్న ధోరణిలో వ్యవహరించారు. ప్రజానేతగా ఎలాంటి యోగ్యతలు లేని ఆయనకు ఎవరికీ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చారు. అలాంటిది జంప్ జలానిల్లో మల్లారెడ్డి పేరు తొలి వరుసలోనే ఉంది. తిట్ల పురాణానికి సాక్ష్యంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి. తమ కాలేజీ బిల్డింగ్ పై పంజా పడగానే మరో దారి లేక పార్టీ వీడను అంటూనే కొడుకుతో సహా బెంగుళూర్ వెళ్లి డికె శివకుమార్ ను కలిసిన ఫోటోను లీక్ చేశారు. కెసిఆర్ దేవుడు అని పదే పదే పలికి ఆ దేవుడికే పంగనామాలు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అదే నోరుతో రేవంత్ సిఎం అవుతారని ముందు చెప్పింది నేనే అనడం మరీ విడ్డూరం. కెనడా లో హోటళ్ల వ్యాపారంలో స్థిరపడ్డ శానంపూడి సైదిరెడ్డికి కూడా రాజకీయ భిక్షను భారాసనే పెట్టింది.
భారాసను వీడి బిజెపిలో చేరిన మర్నాడే ఆయనకు నల్గొండ లోక్‌సభ సీటు లభించింది. వ్యాపారవేత్త అయిన చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి రాజకీయ జీవితం కూడా భారాసతోనే మొదలైంది.ఆయన కూడా పార్టీ వెంట ఉండకుండా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇలా చాలా ఉదాహరణలు చూయించవచ్చు.తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టిడిపి ఉండే అవకాశం లేదనే భావనతో రాజకీయ వృత్తి జీవులు భారాసలో చేరడానికి ఒక అర్థముంది. కానీ భారాస టికెట్‌పై గెలిచిన ఎంఎల్‌ఎలు పార్టీని వదిలి కాంగ్రెస్ వైపు వెళ్లడం ఓటర్లను మోసం చేయడమే. నీవు నేర్పిన విద్యనే నీరజాక్షా! అని ఇప్పుడు కెసిఆర్ ను రేవంత్ రెడ్డి నిలదీసే అవకాశం ఉన్నా పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టండి అన్న తన మాటను కూడా రేవంత్ గుర్తు చేసుకోవాలి. మీరు ఒక గుర్తుపై గెలిచారు, నమ్మకంతో ఓటేసిన వారిని అగౌరవపరచకండి అని సలహా ఇచ్చి పంపాలి. వచ్చిన వాళ్లకు కండువాలు కప్పుతుంటే ఓటర్ల ఎంపికకు అర్థమేముంది?