హైదరాబాద్: గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ మైదానంలో 26.3 ఎకరాల్లో రెండు వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2400 కోట్లతో 14 అంతస్తుల్లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించనున్నారు. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి విభాగినికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసియు వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు.
అలాగే అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర్ నరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తదితరలు హాజరయ్యారు.